విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్‌ సీరియస్‌..నిందితులను వదిలిపెట్టొద్దు

విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్‌ సీరియస్‌..నిందితులను వదిలిపెట్టొద్దు

CM Jagan serious on murder of student Anusha : డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్‌ సీరియస్‌గా స్పందించారు. నిందితులను వదిలిపెట్టొద్దని.. దిశ చట్టం కింద కేసు వేగంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన హత్య ఘటన గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనూష హత్య తనను తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం.. ఆమె కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనూష కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులకు సూచించారు.

హత్యకు గురైన విద్యార్థిని అనూష కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును నర్సాపూర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అందజేశారు. ఘటనపై కలెక్టర్‌, జిల్లా ఎస్పీతో మాట్లాడామన్న ఆమె.. నిందితుడికి వీలైనంత త్వరగా కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించినట్లు సబ్‌ కలెక్టర్‌ చెప్పారు. ఇక సీఎం హామీతో ఆందోళన విరమించారు అనూష కుటుంబ సభ్యులు, విద్యార్థులు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో విద్యార్థిని అనూష హత్య కలకలం సృష్టించింది. అనూష హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనూషను చంపిన విష్ణువర్ధన్‌రెడ్డిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. ప్రేమ వ్యవహారం వల్లే అనూషను చంపారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడదామని ఆమెను నరసరావుపేట శివార్లలోని కాలువ వద్దకు తీసుకెళ్లిన విష్ణువర్దన్‌ రెడ్డి.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు.