విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సీరియస్, కీలక ఆదేశాలు జారీ

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సీరియస్, కీలక ఆదేశాలు జారీ

విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌(Sainor Life Sciences) ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ సీరియస్ అయ్యారు. ఘటన గురించి సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన, విచారణ పూర్తయ్యే వరకు పరిశ్రమను తెరవొద్దని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులతో చెప్పారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. రియాక్టర్‌ దగ్గర లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం:
సోమవారం(జూన్ 29,2020) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటననే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లా కలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ఓ రియాక్టర్ ఉన్న విభాగంలో మాత్రమే గ్యాస్ లీక్ అయ్యిందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సీఎం జగన్ కు అధికారులు నివేదించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై కలెక్టర్ వినయ్ చంద్ సీరియస్ అయ్యారు. నలుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేశారు. ప్రమాదంపై పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు.

వరుస ప్రమాదాలతో విశాఖవాసులు బెంబేలు:
బెంజమైడజోల్(Benzimidazole gas) వ్యాపర్స్ ఎక్కువ మోతాదులో లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా గత ఐదేళ్లలో ఈ పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరోసారి ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. ఇటీవలే గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ విషవాయువు లీక్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయ్యింది. ఇలా వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

* విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్
* సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి
* నలుగురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
* మృతుల్లో షిఫ్ట్ ఇంచార్జ్ నాగేంద్ర, గౌరీ శంకర్
* అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకిరామ్, సూర్యనారాయణ
* హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం, కేర్ ఆసుపత్రికి తరలింపు
* లీక్ అయిన గ్యాస్ బెంజిమిడజోల్ వేపర్ గా గుర్తింపు
* గ్యాస్ లీక్ ఘటనతో మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ నగరం
* స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో విషాదం
* వరుస ఘటనలతో భయాందోళనలో విశాఖ వాసులు
* గ్యాస్ లీక్ ను అదుపు చేసిన సిబ్బంది
* గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం, నలుగురు అధికారులతో కమిటీ

Read:విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి