ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై సీఎం జగన్ సీరియస్

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 12:11 PM IST
ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై సీఎం జగన్ సీరియస్

cm jagan svbc: చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్, ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై ఆరా తీశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. పోర్న్ లింక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. ఎస్వీబీసీని వెంటనే ప్రక్షాళన చేయాలని, ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి విశిష్టను వివరించేలా, పెంపొందించేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని, ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

శతమానం భవతి లింక్ బదులు పోర్న్ లింక్:
టీటీడీకి చెందిన శ్రీ వేకంటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) లో పోర్న్ లింక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబ‌ర్‌లో వెంక‌ట క్రిష్ణ అనే భ‌క్తుడు శ‌‌త‌మానం భ‌వ‌తి కార్యక్రమానికి సంబంధించిన వివ‌రాల‌ను మెయిల్ ద్వారా కోరారు. అందుకు స్పందించిన ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు… భక్తుడికి శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ కాకుండా.. పోర్న్ వెబ్‌సైట్ కి సంబంధించిన లింక్ పంపించాడు. దీంతో షాక్ తిన్న భ‌క్తుడు వెంటనే టీటీడీ చైర్మన్‌, ఈవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై స్పందించిన‌ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు.

మరో నలుగురు ఉద్యోగులకు అదే పని:
దాదాపు 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. ఈ టీం దర్యాప్తులో నిందితుడే కాక మరో ముగ్గురు నుంచి నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సీఈవో వెల్లడించారు.

svbc

పాస్ వర్డ్ సెట్ చేసిన అధికారులు:
ఈ సంఘటన అనంతరం సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుందని సీఈవో తెలిపారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్‌కు పాస్వర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల కంప్యూటర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుస్తుందన్నారు. అలాగే ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించారు.