విశాఖ వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై సీఎం జగన్‌ సీరియస్‌, విజయసాయిరెడ్డి సహా ఆ ముగ్గురికి క్లాస్

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 03:21 PM IST
విశాఖ వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై సీఎం జగన్‌ సీరియస్‌, విజయసాయిరెడ్డి సహా ఆ ముగ్గురికి క్లాస్

cm jagan : విశాఖ జిల్లా అభివృద్ధి సమావేశంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్‌ సీరియస్‌ అయ్యారు. విశాఖ వైసీపీ నేతలు వెంటనే తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో వైజాగ్ నేతలు విశాఖ నుంచి తాడేపల్లికి పయనం అయ్యారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌… విశాఖ వైసీపీ నేతలు కరణం ధర్మశ్రీ, అమర్‌ నాథ్ రెడ్డితోపాటు.. ఎంపీ విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. విశాఖ డీడీఆర్‌సీ సమావేశంలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ ముగ్గురికి క్లాస్ తీసుకుంటున్నారు.

పార్టీలో అంతర్గత విభేదాలపై జగన్ ఫోకస్:
జిల్లా అభివృద్ధి సమావేశంలో పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగడమేంటని  జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. విశాఖ డీడీఆర్‌సీ‌లో ఏం జరిగిందన్న దానిపై విజయసాయిరెడ్డి జగన్‌కు వివరిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఇప్పటికే ఇదే అంశంపై సీఎం జగన్‌.. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కన్నబాబుతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారి పార్టీలోని అంతర్గత విభేదాలపై జగన్ దృష్టి సారించారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఎమ్మెల్యే కరణం వర్సెస్ విజయసాయిరెడ్డి:
విశాఖలో నిన్న(నవంబర్ 11,2020) జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం జరిగింది. వేదికపై ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి భూముల వ్యవహారంపై మాట్లాడారు. ఎన్వోసీ ఉంటేనే చట్టబద్ధత కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో ప్రతి ఆక్రమణ వెనుక రాజకీయ నేతలు ఉంటున్నారని ఆరోపించారు. ఇటీవల పాలవలస భూ ఆక్రమణలను ఉద్దేశించి పరోక్షంగా ఆయనీ వ్యాఖ్యలు చేయగా.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే రాజకీయ నేతల అవినీతి అని ప్రస్తావించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ – విజయసాయి రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ వైజాగ్ వైసీపీ నేతల తీరుపై ఫైర్ కావాల్సి వచ్చింది.