వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్ : ఓటింగ్ కు 18మంది దూరం

శాసనసభలో వైసీపీ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఓటింగ్‌ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 02:03 PM IST
వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్ : ఓటింగ్ కు 18మంది దూరం

శాసనసభలో వైసీపీ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఓటింగ్‌ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసన సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించారు. 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే వైసీపీకి 151మంది ఎమ్మెల్యేలు ఉండగా… ఓటింగ్ సమయానికి 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలో లేరు. విప్ లు చెవి రెడ్డి, పార్థసారథి, దాడి శెట్టి రాజాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నవారిలో ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీలోనే ఉండిపోయారు. ఓటింగ్ సమయంలో ఎమ్మెల్యే మద్దాలగిరి అసెంబ్లీలో లేరు.

ఇక మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ఎమ్మెల్సీలు కావడంతో వారికి ఓటు హక్కు లేదు. 18మంది సభలో లేకపోయినా.. 133 మంది(జనసేన ఎమ్మెల్యే రాపాక సహా) అనుకూలంగా ఓటు వేయడంతో.. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. 

కాగా, వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై అటు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. దీన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. శాసనసభలో వైసీపీ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌పై జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఓటింగ్‌ సమయంలో 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఆయన మండిపడ్డారు. సభ్యులు గైర్హాజరు కావడం ఏంటని ప్రశ్నించారు. చివరికి విప్‌లు చెవిరెడ్డి, దాడిశెట్టి రాజా కూడా ఓటింగ్‌ సమయంలో లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారట. మండలి తీర్మానంపై ఓటింగ్‌ ఉందని సభ్యులకు ముందే ఎందుకు చెప్పలేదని బాధ్యులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఏకంగా 18మంది గైర్హాజరు కావడం ఏంటని అసహనం వ్యక్తం చేశారట.

కాగా, సమాచార లోపంతోనే ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారని వైసీపీ అంటోంది. ఎమ్మెల్యేలకు ఓటింగ్ సమాచారం అందలేదని చెప్పింది. అంతే తప్ప మరో కారణం లేదంది. ఓటింగ్ సమయంలో శాసన సభ డోర్లు మూసేయడంతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ల లేకపోయారని ఆ పార్టీ నేతలు వివరించారు.