క్లైమాక్స్ కు రాజధాని రగడ : జనవరి 20న సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 01:27 AM IST
క్లైమాక్స్ కు రాజధాని రగడ : జనవరి 20న సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష‍్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. 

ఏపీ రాజధాని విషయమై ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతి రైతుల ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. జనవరి 18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. కేబినెట్ భేటీలో చర్చ అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడిన కమిటీ.. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది.

ఇటు మూడు రాజధానుల ప్రతిపాదనలకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్ట్ అందజేసింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. విశాఖలో సీఎం, గవర్నర్ ఆఫీస్‌లు, సచివాలయం, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు, పలు కార్యాలయాల ఏర్పాటు చేయాలని సూచించింది. రెండో ఆప్షన్‌లో‌నూ అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకే మొగ్గు చూపింది. విశాఖలో సీఎం, గవర్నర్ కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ, సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సిఫార్సులు చేసింది.

జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టులను అధ్యయనం చేసేందుకు కేబినెట్ మంత్రులతో నియమించిన హై పవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన హై పవర్ కమిటీ రెండుసార్లు భేటీ అయింది. తొలి సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హై పవర్ కమిటీ.. రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. జనవరి 13న మరోసారి సమావేశం కానుంది. కేబినెట్ భేటీలోగా నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.

హై పవర్ కమిటీ నివేదిక అందజేసిన వెంటనే కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. నివేదికపై తక్షణం క్యాబినెట్‌లో చర్చించి రాజధానిపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తోంది. కేబినెట్ భేటీలో చర్చించిన వెంటనే అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడమే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

* ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం 
* రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ 
* అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం
* ఈ నెల 18న మంత్రి మండలి సమావేశం 
* మరోసారి సమావేశం కానున్న హై పవర్ కమిటీ
* ఇప్పటికే సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన హై పవర్ కమిటీ రెండుసార్లు భేటీ
* తొలి సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బీసీజీ ప్రతినిధులతో భేటీ 
* రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై చర్చ
* ఈ నెల 13న మరోసారి సమావేశం 
* కేబినెట్ భేటీలోగా నివేదిక అందజేసే దిశగా చర్యలు 
* హై పవర్ కమిటీ నివేదిక అందజేసిన వెంటనే కేబినెట్ భేటీ

Also Read : మీ Phone నెంబర్ ఎవరైనా Block చేస్తే ఇలా తెలుసుకోండి!