Aadhaar Secretariats : గుడ్ న్యూస్.. ఇకపై సచివాలయాల్లో ఆధార్ సేవలు

రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Aadhaar Secretariats : గుడ్ న్యూస్.. ఇకపై సచివాలయాల్లో ఆధార్ సేవలు

Aadhaar Secretariats : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రాల్లో, పెద్ద గ్రామ పంచాయతీల్లో ఆధార్‌ కేంద్రం లేని ప్రాంతాలను గుర్తించి వాటిలో వచ్చే నెలలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే రెండో దశలో మరికొన్ని సచివాలయాల్లో ఏర్పాటు చేసే యోచనతో ఉన్నారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ కేంద్రాల ఏర్పాటులో ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పులు వంటి సేవలు ఇక గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలను వచ్చే నెల రెండో వారంలో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ కమిషనర్‌ భరత్‌గుప్తా తెలిపారు. మొదట 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు వీటిని
విస్తరిస్తామన్నారు.

ఆధార్‌ సేవలు అందుబాటులో లేని 226 మండలాల్లో మొదట ప్రాధాన్యతగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా జిల్లాకు 20 చొప్పున గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆధార్‌ సేవలకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి జిల్లాలో ఏయే గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు.

ఆధార్ ఎన్ రోల్ మెంట్ కోసం, ఆధార్ లో మార్పులు చేర్పుల కోసం జనాలు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాలు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. గ్రామాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఊరటనిచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.