Andhra Pradesh: కొవ్వూరులో సీఎం జగన్, కడప జిల్లాలో లోకేశ్.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని మంగళవారం 75,875 మంది భక్తులు దర్శించుకున్నారు.

Andhra Pradesh: కొవ్వూరులో సీఎం జగన్, కడప జిల్లాలో లోకేశ్.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ..

CM Jagan and Lokesh

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాయాత్ర బుధవారం నుంచి కడప జిల్లాలో కొనసాగనుంది.

కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘జగనన్న విద్య దీవెన’ రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. బుధవారం ఉదయం 9 20 నిమిషాలకు హెలికాప్టర్లో సీఎం జగన్ కొవ్వూరు చేరుకుంటారు. 9.30కి బైపాస్ రోడ్ లో బుద్ధుడు జంక్షన్ వద్ద హెలిప్యాడ్ నుండి రోడ్ షో లో పాల్గొంటారు. 9.45కి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11.15 వరకు కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. 11.30కి హెలిప్యాడ్‌కు చేరుకొని.. 12.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి సీఎం జగన్ బయలుదేరుతారు.

కడపలో లోకేష్ పాదయాత్ర..

లోకేష్ యువగళం పాదయాత్ర నేటినుంచి కడప జిల్లాలో కొనసాగనుంది. మంగళవారం రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం శుద్దపల్లి వద్ద కడప జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలోకి వచ్చిన పాదయాత్రకు కడప జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. శుద్దపల్లిలో లోకేష్ బస చేశారు. ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 109వ రోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు నాయకులు, కార్యకర్తలకు సెల్ఫీ టైం. మూడున్నర తరువాత శుద్దపల్లినుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. నేడు జంగాలపల్లె, జె కొట్టాల పల్లె, ఉప్పలూరు, బలపనూరు క్రాస్, నెమ్మలదిన్నె, గర్షలూరు క్రాస్, యన్ కొట్టాల పల్లె, గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు యన్ కొట్టాలపల్లె గ్రామం దాటిన తర్వాత లోకేష్ బస చేస్తారు.

రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ..

రేపటి నుంచి ఏపీలో పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ప్రైవేటు, గవర్నమెంట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. మెరిట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఫీజు కట్టి వెన్ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. మే 29 నుంచి జూన్ 5వ తేదీ లోపు ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి. జూన్ 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.

టీచర్ల బదిలీలకు దరఖాస్తులు..

ఏపీలో టీచర్ల బదిలీలకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. నేటి నుంచి 26 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. రేపటి నుంచి 27 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 28, 29 తేదీల్లో సీనియారిటీ లిస్టును ప్రకటిస్తారు. 30న అభ్యంతరాలను స్వీకరించి, జూన్ 2, 3 తేదీల్లో తుది లిస్టును ప్రకటిస్తారు. జూన్ 5 నుంచి 8 వరకు ఆప్షన్స్ ఇవ్వాలి. జూన్ 9 నుంచి 11 వరకు బదిలీ అయిన వారి జాబితా విడుదల చేస్తారు.

ఏపీ ఐసెట్ -2023 పరీక్ష..

ఏపీ ఐసెట్-2023 పరీక్షను నేడు, రేపు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు మరో సెషన్ జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇందుకోసం మొత్తం 111 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నేడు ‘అగ్రి, ఫార్మా’ ప్రైమరీ కీ విడుదల..

AP EAPCET పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 15 నుంచి 19 వరకు ఎంపీసీ స్ట్రీమ్, 22, 23 తేదీల్లో బైసీపీ స్ట్రీమ్ పరీక్షలకు 3.15 లక్షల మంది (93.38 శాతం) హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం ప్రైమరీ కీ మంగళవారం విడుదలైంది. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రైమరీ కీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యంతరాలుంటే ఎల్లుండి వరకు ఆన్‌లైన్‌లో పంపవచ్చు.

టెన్త్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల ..

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌లో తప్పులుంటే వాటిని ఆయా స్కూళ్ల హెడ్ మాస్టర్లు సరిచేయాలని విద్యాశాఖ సూచించింది. కాగా, జూన్ 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇంటర్ బోర్డు ఉద్యోగుల బదిలీకి ఉత్తర్వులు..

ఇంటర్ కాలేజీ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి జూన్ 15లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ చేయనుంది. ఎక్స్‌పీరియన్స్ లేని వారుకూడా బదిలీకి అప్లయ్ చేసుకోవచ్చని సూచించింది. 2025 మే 31లోపు రిటైర్మెంట్ అయ్యేవారికి, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలకు ఇందుకు మినహాయించింది.

తిరుమల సమాచారం..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని మంగళవారం 75,875 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు సమకూరింది. సర్వదర్శనం కోసం 20 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.

విద్యార్థి ఆత్మహత్య..

కాకినాడలోని తాళ్ళరేవు మండలం జార్జిపేట‌లో టెన్త్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యానని శ్రావణి అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సప్లిమెంటరీ ఫీజు కట్టినప్పటికీ మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. నీలపల్లి జడ్పీ పాఠశాలలో చదివిన శ్రావణి, తెలుగులో ఫెయిల్ అయింది.

రిమాండ్ ఖైదీ మృతి..

కాకినాడ జిజిహెచ్‌లో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ హరి మృతి చెందాడు. హరి స్వస్థలం విజయనగరం జిల్లా రాజాం మండలం మెంతిపేట గ్రామం. చెక్‌బౌన్స్ కేసులో ఈనెల 12న రాజాం కోర్టు శిక్ష విధించింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈనెల 17న అనారోగ్యంతో ఉన్న ఖైదీ హరిని చికిత్స నిమిత్తం జైలు అధికారులు కాకినాడ తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతు హరి మృతి చెందాడు.