కాళేశ్వరానికి సీఎం కేసీఆర్, ఢిల్లీకి సీఎం జగన్

కాళేశ్వరానికి సీఎం కేసీఆర్, ఢిల్లీకి సీఎం జగన్

CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్‌లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటి మట్టం 100 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరే లంచ్ చేయనున్నారు సీఎం కేసీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ముక్తిశ్వరస్వామి వారి ఆలయంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీఎం జగన్‌…హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. పెండింగ్‌ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రిని జగన్‌ కోరే అవకాశం ఉంది.