అంతర్వేదిలో కొత్త రథం : స్వామి సేవలో సీఎం జగన్, హామీని నిలబెట్టుకున్న సర్కార్

10TV Telugu News

Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్‌ 2021, ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం అంతర్వేదికి వెళ్లనున్నారు. సుమారు గంటసేపు స్వామి సేవలో గడపనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11 గంటల 35 నిమిషాలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు రథాన్ని ప్రారంభిస్తారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.

రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్‌ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 95 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవాల సమయానికి పనులు వేగవంతం చేసి రథాన్ని సిద్ధం చేశారు.