మహిళలకు రక్షణ : అభయ ప్రాజెక్టు, వాహనాల్లో ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటు

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 07:11 AM IST
మహిళలకు రక్షణ : అభయ ప్రాజెక్టు, వాహనాల్లో ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటు

CM YS Jagan To Launch Abhayam Project : ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభయం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే… వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు అభయం అనే ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీన్ని 2020, నవంబర్ 23వ తేదీ సోమవారం సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. క్యాంప్‌ ఆఫీస్‌లో వర్చువల్‌గా ప్రారంభిస్తారు.



2015లో 80.09 కోట్లు కేటాయింపు : 
అభయం మొత్తం ప్రాజెక్టు వ్యయం 138.48 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి 80.09 కోట్లు కేటాయించింది. దీంట్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది యష్‌ టెక్నాలజీస్‌ ఈ టెండరును దక్కించుకుంది.



https://10tv.in/lorry-theft-in-trichy/
విశాఖలో వెయ్యి ఆటోల్లో : 

దశలవారీగా రాష్ట్రంలో లక్ష రవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. రవాణా వాహనాల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చుతారు. తొలుత వెయ్యి ఆటోల్లో ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు నాటికి రాష్ట్రంలోని లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు కొనసాగుతుంది.



క్యూ ఆర్ కోడ్ స్కాన్ : 
ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో అభయం మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనం ఎక్కే ముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పోలీసులకు పంపితే.. ఆ వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుకు చేరుతుంది. దీంతో క్యాబ్‌ లేదా ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ తర్వాత సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు.