తెలుగురాష్ట్రాలను వణికిస్తోన్న చలి

తెలుగురాష్ట్రాలను వణికిస్తోన్న చలి

Cold Waves in Telugu States : తెలుగురాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత మరో రెండ్రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్న సాధారణం కంటే 3.7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లోనే అత్యల్పంగా చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, నందిగామలో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల ప్రాంతాలైన లంబసింగి, పాడేరు ఘాట్, డల్లాపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.రాగల 24 గంటల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి గాలులు మరింత బలంగా వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోతున్నాయి. నిన్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 4.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 4.6 డిగ్రీలు, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట, మర్పల్లిలో 5 డిగ్రీల చొప్పున రికార్డైంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని పలుచోట్ల రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి వణికిస్తోంది. పొద్దెక్కేదాకా పొగమంచు వీడటంలేదు.

మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో చలి పంజా విసురుతోంది. రాత్రితోపాటు పగలు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. పగలు కూడా చలి వణికిస్తోంది. నిన్న నగరంలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. చలి తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.