కాలనీ వాసుల స్వంత మేనిఫెస్టో : బెదిరిపోతున్ననేతలు

కాలనీ వాసుల  స్వంత మేనిఫెస్టో : బెదిరిపోతున్ననేతలు

ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేసే ఏ నాయకుడైనా అక్కడికి వెళ్లకుండా ఉంటారా? అన్ని ఓట్లను వదులుకుంటారా? కానీ ఎవ్వరు ఆ కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు..అక్కడికి వెళ్లలేరు..ఆ ఓట్లను వదులుకోలేక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సతమతమైపోతున్నారు. ఏదోకారణం ఉండే ఉంటుంది కదూ..ఏమా కాలనీ..ఎక్కడు ఉందో తెలుసుకుందాం..
 

విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలోని అంబేడ్కర్‌ కాలనీ.రిటైర్ అయిన  ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, ప్రగతిశీల మహిళా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కాలనీ  మహిళలంతా ఏకత్రాటిపై నిలిచారు. ఎన్నికల అభ్యర్థులు ఇచ్చే హామీలు ఏమిటో వారు వినరు కానీ తమకు ఏం కావాలో డిమాండ్ చేస్తు..ఓ ‘మేనిఫెస్టో’ను తయారు చేసుకున్నారు. దాన్ని బాండ్‌పేపర్‌పై ప్రింట్ చేయించారు. 2014 ఎన్నికల్లో ప్రచారం కోసం తమ కాలనీకి వచ్చిన అభ్యర్థులకు దాన్ని ఇచ్చారు.  బాండ్‌ పేపర్స్ పై ఉన్న మేనిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తానంటూ సంతకం చేయాలని డిమాండ్ చేశారు. అది కొందరు నేతలకు నచ్చలేదు. దీంతో సదరు నేత కాలనీ పెద్దలకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. 
 

ఆ  ఫోన్‌ సంభాషణలను రికార్డ్‌ చేసిన కాలనీవాసులు డైరెక్ట్ గా కలెక్టర్‌ కు కంప్లైంట్ చేశారు. దీనిపై వెంటనే  స్పందించిన ఎన్నికల సంఘం సదరు  అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో సదరు నేత ఆ ఎన్నికల్లో ఓడిపోవటం విశేషం. ఈ క్రమంలో అంబేడ్కర్ కాలనీవాసులు ఈ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు. ప్రచారం కోసం వచ్చే అభ్యర్థులకు అందించాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఏ పార్టీకి చెందిన నేతలు ఆ కాలనీకి వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.