కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : August 25, 2020 / 10:25 AM IST
కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుట్ల మండలం సున్నపురాళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత గంగిరెడ్డి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.



ఆసుపత్రి నుంచి ఒంటరిగా వెళ్లారు, మళ్లీ రాలేదు:
గంగిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో పాజిటివ్‌‌గా తేలింది. ఆదివారం(ఆగస్టు 23,2020) ప్రొద్దుటూరులోని మదన్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంటరిగా సోమవారం(ఆగస్టు 24,2020) సాయంత్రం ఆస్పత్రి నుంచి బయటికి వచ్చారు. ఎక్కడికి వెళుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. కిందకు వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు.

రైలు కింద పడి సూసైడ్:
అలా బయటకు వెళ్లిపోయిన గంగిరెడ్డి తిరిగి రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా వారు జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా.. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెలో రైల్వే ట్రాక్‌పై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆయన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.



ఆత్మస్థైర్యమే కరోనాకు అసలు మందు:
కరోనా ప్రాణాంతకమే కానీ మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే నయం అవుతుంది. 100 ఏళ్లు పైబడిన వారు కూడా కరోనాను జయించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నా ఇంకా కొంతమందిలో మార్పు రావడం లేదు. కరోనా సోకిందనే భయంతో, మనస్తాపంతో డిప్రెషన్ కు లోనవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరోనాకు గుండె నిబ్బరం, మనోబలమే పెద్ద మందు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌ను మనోబలంతో జయించిన వారు చాలామంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. రోగ నిరోధక శక్తి ఉండి, వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటే ఆ కొవిడ్‌ను ఇట్టే తరిమేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.



చికిత్స, పౌష్టికాహారంతో వ్యాధి నయం:
కొవిడ్‌ బారినపడితే భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్‌ వచ్చినా ఆందోళన చెందాల్సిన పని లేదు. ధైర్యంగా చికిత్స చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడంతోనే వ్యాధి నయమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.