మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టిన వల…చేపలు పట్టే చేతులతో ముష్టి యుద్ధాలు

మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టిన వల…చేపలు పట్టే చేతులతో ముష్టి యుద్ధాలు

Controversy over Ballavala and Ailavala nets in Prakasam : అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాల్సిన గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య చిచ్చుపెడుతోంది. ఓ రకం వలను ఉపయోగించడాన్ని మరో వర్గం తప్పుపడుతోంది. చేపలు పట్టే చేతులతో ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు.

సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే జాలర్ల జీవితాలు.. సముద్ర అలల్లాగే ఉంటాయి. వలలో చేపలు పడితే నోట్లోకి ఐదు వేళ్లు వెళ్తాయి.. లేదంటే పస్తులే… సముద్రాన్ని నమ్ముకుని, భారాన్ని గంగమ్మపై వేసి, తీరాన్ని వదిలి, కంటికి కనిపించనంత దూరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితం దినదిన గండమే. వాతావరణం సహకరిస్తే ఒడ్డుకు చేరుతారు.. లేదంటే జలసమాధి అవుతారు. కుటుంబానికి కడచూపు కూడా దక్కదు.

ప్రకాశం జిల్లా వాడరేవులో జరిగిన గొడవతో జాలర్ల వివాదం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వాడరేపులో బల్లవల, ఐలవల జాలర్ల మధ్య గొడవ జరిగింది. జాలర్లు వేటకు వాడే వలల్లో చాలా రకాలున్నాయి. అందులో బల్లవల, ఐలవల ముఖ్యమైనవి. బల్లవల తీగల మధ్య దూరం చాలా తక్కువగాఉంటుంది. అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. బల్లవలను వాడటం వల్ల చిన్న చేపలు, గుడ్లు కూడా వలకు చిక్కడంతో మత్స్య సంపద నాశనమవుతోందని ఐలవల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

ఐలవల, బల్లవల వాడే మత్స్యకార గ్రామాల మధ్య చాలాకాలంగా వివాదాలున్నా ఇటీవల అవి రచ్చకెక్కాయి. ఐలవల ఉపయోగిస్తున్న 77 గ్రామాలకు చెందిన వర్గంలోని రెండు పడవలు, ఇద్దరు వ్యక్తులను వాడరేవు మత్స్యకారులు బంధించారు. ఆ వెంటనే…16 బోట్లతో చుట్టుముట్టి ఛేజింగ్ చేసి వాడరేవుకు చెందిన 5బల్లవల బోట్లతో పాటు మరో ఐదుగురిని నిర్భందించారు ఐలవల ఉపయోగిస్తున్న కఠారి పాలెం మత్స్యకారులు. దీంతో ఇరువర్గాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసుల జోక్యం, జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే వచ్చి రాజీ చేయడం, అన్నదమ్ముల్లా ఉన్న రెండు వర్గాల మధ్య దూరం పెరగడం జరిగిపోయింది.

సాధారణంగా మత్స్యకారులు…బోట్ల ద్వారా సముద్రంలో వేటాడేందుకు 40MM నుంచి 80MM సైజ్ హోల్స్ ఉండే వలలను వాడుతుంటారు. దీని ద్వారా మత్య్సకారులకు అర కిలో నుంచి కిలో.. ఆపై బరువున్న చేపలు వలలో పడతాయి. వాటిని బయటకు తెచ్చి మార్కెట్లకు తరలిస్తే మంచి గిరాకి ఉంటుంది. కానీ…ఆఫ్ ఇంచ్ అంటే 12 MM సైజ్ ఉండే బల్లవలను ఉపయోగించడం వల్ల అప్పుడే గుడ్డు నుంచి పురుడు పోసుకుంటున్న చేపల నుంచి… చేపలు పెట్టిన గుడ్ల వరకు అన్నీ…సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చేస్తాయి.

ఈ బల్లవల విషయంలోనే….ఇప్పుడు ఇరు వర్గాల మత్స్యకారుల మధ్య గొడవలు తలెత్తాయి. వాస్తవానికి బల్లవల ఉపయోగించే పెద్ద బోట్లు సముద్రంలోని 8 నాటికల్ మైళ్ల అవతల వేట సాగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నవి. కాని అందుకు విరుద్ధంగా సముద్ర ఒడ్డుకు అతి దగ్గరలో పెద్ద బోట్లను ఉపయోగిస్తున్నారని…చిన్న బోట్లపై వేటసాగించే మత్య్సకార గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సముద్రంలో 8 నాటికల్ మైళ్ల దూరంలో లోతు ఎక్కువగా ఉంటుంది. అక్కడ పెద్ద బోట్లు…బల్లవల ఉపయోగించడం వల్ల…అడుగు భాగాన ఒడ్డుకు దగ్గరగా ఉండే చిన్న చేపలు కాకుండా పెద్ద చేపలు మాత్రమే అందులో పడే అవకాశం ఉంటుంది. ఇలా అయితే..ఎవరికి నష్టం ఉండదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. వాడరేవు మత్స్యకారులు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇందుకు బల్లవల ఉపయోగించే మత్స్యకారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్న వారి మధ్య మొదలైన వివాదం చల్లారాల్సింది పోయి ఇతరుల జోక్యంతో మరింత ముదిరింది. వల పెట్టిన చిచ్చు జాలర్ల మధ్య దూరాన్ని పెంచింది.

మత్స్యకారుల మధ్య సామరస్య పూర్వక పరిష్కారం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌. మత్స్యకార పెద్దలు జైలు నుంచి రాగానే అందరినీ ఓ చోట కూర్చోబెడతామన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రెండు మత్స్యకార వర్గాలతో చర్చించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. పరిస్థితిని చక్కబరచాలని తమపైనా ఒత్తిడి ఉందన్నారు. రెండు వర్గాలకు తగిన న్యాయం చేస్తామన్నారు.