ఏపీలో ఎన్నికల ఏకగ్రీవాలపై రాజకీయ రగడ

ఏపీలో ఎన్నికల ఏకగ్రీవాలపై రాజకీయ రగడ

Controversy over electoral consensus in AP  :  ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై వివాదం నడవగా.. ఇప్పుడు మరో అంశంపై రగడ మొదలైంది. మరి స్థానిక పోరులో మరోసారి రచ్చకు కారణమేంటి..? ప్రభుత్వం – ప్రతిపక్షాలు – ఎస్‌ఈసీల మధ్య ముదురుతున్న వివాదమేంటి..? ఏపీలో పంచాయితీ సమరం మరోసారి హీటెక్కింది. ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ చేసిన ఆదేశాలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. ఈ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతించగా. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏకగ్రీవం వలన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ అంటుండగా.. ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజలను మభ్య పెట్టేందుకే ఏకగ్రీవాలని ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు సర్కార్ వర్సెస్‌ ఎస్‌ఈసీగా మారిపోయాయి. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిన నిమ్మగడ్డ.. ప్రభుత్వంతో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై వైసీపీ చేసిన ఆరోపణలపై.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కౌంటర్‌ ఇచ్చారు. రాజ్యాంగబద్దంగా నడుచుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఉద్యోగులపై తనకు ఎలాంటి కక్ష లేదని.. ఎవరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు ఎస్‌ఈసీ సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌ను ఏపీ ప్రభుత్వం తిప్పిపంపింది. గోపాలకృష్ణ ద్వివేది, గిరాజా శంకర్‌లను బదిలీ చేసేది లేదని తేల్చి చెప్పింది. ఇద్దరు అధికారులను విధుల నుంచి తప్పిస్తూ.. ఎస్‌ఈసీ పంపిన సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం వెనక్కి తిప్పిపంపింది. ఐఏఎస్‌లపై ప్రొసీడింగ్స్‌ ఇచ్చే అధికారం ఎస్‌ఈసీకి లేదన్న ప్రభుత్వం.. వివరణ కోరకుండా ప్రొసీడింగ్స్‌ జారీ చేయలేరంది. ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లు వారి వారి పదవుల్లో యథాతథంగా కొనసాగుతారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

ఇక సమాచార పౌరసంబంధాల కమిషనర్‌కు మెమో జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించింది పత్రికల్లో ప్రకటన జారీపై వివరణ ఇవ్వాలని SEC మెమో ఇచ్చింది. ఇకపై ప్రకటన ఇవ్వాలంటే ప్రభుత్వం, ఏజెన్సీలు తమ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.. ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇచ్చి.. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని ఆదేశించింది..

ఏకగ్రీవాల పేరుతో వైసీపీ కొత్త నాటకమాడుతోందని ఆరోపించింది బీజేపీ, జనసేన బృందం. ఏకగ్రీవాల పేరుతో అభ్యర్థులను ప్రలోభ పెట్టే అవకాశం ఉందంటున్న ఆ పార్టీల నేతలు.. ఇవాళ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని గవర్నర్‌కు విన్నవించనున్నారు.