ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 01:43 PM IST
ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్‌ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయినా..మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేయగలిగామన్నారు.

ఇది మనం సాధించిన విజయంగా చెప్పొచ్చని, కానీ..తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. 2020, జులై 28వ తేదీ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…సీఎం జగన్ మాట్లాడుతూ…

‘6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు కాస్త భయపడతారు. దీనికి భయపడి పరీక్షలు తగ్గించి, రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎప్పుడూ అలా జరగలేదు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రతి అధికారి సీరియస్‌గా ఉన్నారు. ఇంకా అగ్రెసివ్‌గా పరీక్షలు చేస్తున్నారు.

ఎక్కడా కూడా మనం తప్పులు చేయలేదు. కేసులు తక్కువ చేసి చూపలేదు. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం.
దేశంలోనే అత్యధికం ఇది. రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదే. దాదాపు ప్రతి మిలియన్‌కూ 31వేలకుపైగా టెస్టులు చేస్తున్నాం. 90శాతం టెస్టులు కోవిడ్‌ క్లస్టర్లలో చేస్తున్నాం.

కోవిడ్‌ సోకిన వారిని గుర్తించి..వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేశారు. టెస్టులు అగ్రెసివ్‌గా చేస్తున్నాం, పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నాం. దీని తర్వాత మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. విశ్లేషణాత్మక ధోరణితో ముందుకు పోవాలి.’ అని సీఎం జగన్ అన్నారు.