Corona Education System : విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టిన కరోనా మహమ్మారి

కరోనా... ఏ వ్యవస్థను ఎంత నాశనం చేసిందో తెలియదు కానీ భారతీయ విద్యావ్యవస్థను మాత్రం కోలుకోలేని దెబ్బకొట్టింది. విద్యార్ధుల జీవితాల్లో కీలకమైన రెండు సంవత్సరాలను మింగేసింది. ఇన్నాళ్లూ దూరంపెట్టిన గ్యాడ్జెట్లతో ఆన్‌లైన్‌ క్లాసులతో గదిలో బందీలుగా చేసింది.

Corona Education System : విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టిన కరోనా మహమ్మారి

Corona Education System

Corona impact on the education system : కరోనా… ఏ వ్యవస్థను ఎంత నాశనం చేసిందో తెలియదు కానీ భారతీయ విద్యావ్యవస్థను మాత్రం కోలుకోలేని దెబ్బకొట్టింది. విద్యార్ధుల జీవితాల్లో కీలకమైన రెండు సంవత్సరాలను మింగేసింది. ఇన్నాళ్లూ దూరంపెట్టిన గ్యాడ్జెట్లతో ఆన్‌లైన్‌ క్లాసులతో గదిలో బందీలుగా చేసింది. ఓవైపు అలవాటు లేని ఆన్‌లైన్‌ విద్యావ్యవస్థ, మరోవైపు అరకొర సౌకర్యాలు… అర్థం కాని పాఠాలు… ఇటు మూతబడుతున్న స్కూళ్లు, కూలిపనుల బాట పట్టిన ఉపాధ్యాయులు మొత్తంగా విద్యావ్యవస్థను వైరస్ ఆగమాగం చేసింది.

ఉదయాన్నే పిల్లల పరుగులు, క్యారేజీలతో తల్లుల కుస్తీలు, బస్సు హారన్లు… బిరబిరమంటూ స్నేహితులతో కలసి క్లాస్‌రూమ్‌లోకి పరుగులు… టీచర్‌ వచ్చేదాకా సరదాగా కబుర్లు…. గుడ్‌మార్నింగ్‌ టీచర్‌తో మొదలై హోంవర్క్‌తో ముగిసే క్లాసులు…. కరోనా కమ్ముకొచ్చే వరకూ పరిస్థితి ఇది. కానీ ఒక్క వైరస్‌తో విద్యావ్యవస్థ మొత్తం తలకిందులైంది. క్లాసుల్లేవ్, పరీక్షల్లేవ్, అంతా ఆన్‌లైనే… సిగ్నల్స్‌ లేకపోవడం, తల్లిదండ్రుల బలవంతంమీద బద్దకంగా క్లాసులు…అర్థం కాని పాఠాలు మొత్తంగా అంతా అయోమయం…నెలో రెండు నెలలో కాదు ఏడాదికి పైగా ఇదే పరిస్థితి.

కరోనా కారణంగా పిల్లలు స్కూళ్ల మొహం చూసి చాలా రోజులైంది. కొంతమంది వెళ్లినా తమ క్లాస్‌రూమ్‌లో తామే బంధీలుగా ఉండాల్సిన పరిస్థితి. సెకండ్‌వేవ్‌ కారణంగా చాలాచోట్ల స్కూళ్లు, కాలేజీలు మళ్లీ మూతబడ్డాయి. మూతబడుతున్నాయి. పరీక్షలు వాయిదా పడుతున్నాయి. లేదా రద్దవుతున్నాయి. పిల్లలు పరీక్షలు రాయకుండానే పైక్లాసులకు ప్రమోట్ అవుతున్నారు. ఒకప్పుడు మాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పుకునేవారు… తర్వాత గ్రేడ్‌ చెప్పుకునేవారు… ఇప్పుడు ఏ గ్రేడో తెలియకుండానే స్కూల్‌, కాలేజ్‌ గేట్ దాటుతున్నారు.

మన విద్యావ్యవస్థలో ప్రతిరోజూ కీలకమే. ఓ రోజు పాఠం వినకపోతే తర్వాతి పాఠాలు అర్థం కావు. ఈ క్లాసులో సరిగా చదవకపోతే పైక్లాసులో ఇక్కట్లే.. అలాంటి చోట దాదాపు రెండు విద్యా సంవత్సరాలు పరీక్షలు లేకుండానే పైక్లాసుకు వెళ్లాల్సిన పరిస్థితి. పిల్లలు రోజూ స్కూలుకు వెళ్లడం, టీచర్లు చెప్పే పాఠాలు వినడం, బోర్డుపై చూసి రాసుకోవడం, పుస్తకాలతో కుస్తీలు పట్టడం, డౌట్స్‌ ఉంటే టీచర్లనే అడిగి నివృత్తి చేసుకోవడం మన విద్యావ్యవస్థ లక్షణం. అలాంటిది కరోనా కారణంగా అసలే మాత్రం అలవాటులేని ఆన్‌లైన్‌ వ్యవస్థకు మళ్లాల్సి వచ్చింది. దీంతో పిల్లలు ఆ వ్యవస్థకు అలవాటు పడలేకపోయారు. ప్రాథమిక స్థాయిలో ఆన్‌లైన్‌ తరహా బోధన చాలా కష్టం. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులే ఉపాధ్యాయుల పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపే తల్లిదండ్రులు పిల్లల గురించి పూర్తిగా శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు దూరమయ్యారు.

మన దగ్గర పేరుకే 4G అయినా చాలా చోట్ల పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ లేదు. దీంతో చాలామందికి చదువు దూరమైంది. భారమైంది. నెట్‌వర్క్‌ ఉన్నచోట్ల కూడా సిగ్నల్స్‌ సమస్య… పిల్లలకు ఓ రోజు పాఠాలు అర్థం కాకపోతే తర్వాత మిగిలిన పాఠాలు అర్థం కావడం కష్టమే. ఫలితంగా చాలామంది భారంగా పాఠాలు వింటున్నారు. కంప్యూటరో, ఫోనో ఉంటేకానీ ఆన్‌లైన్‌ పాఠాలు వినలేరు. కానీ అవి లేక, ఎలాగోలా కష్టపడి అవి కొనుక్కునేసరికి చాలా పాఠాలు అయిపోయి అంతా గందరగోళం. పిల్లల్ని గాడ్జెట్లకు దూరంగా ఉంచిన తల్లిదండ్రులే చివరకు వాటిని కొనివ్వాల్సిన పరిస్థితి. ఏడాదిగా ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నా కొంతమంది పిల్లలు తాము ఏం పాఠాలు విన్నామో కూడా చెప్పలేని దుస్థితి.

ఆన్‌లైన్‌ వ్యవస్థ అనేది హఠాత్తుగా రావాల్సిన మార్పు కాదు… దశలవారీగా తీసుకురావాల్సిన సంస్కరణల ప్రక్రియ. కానీ ఒక్కసారిగా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికి సిద్ధంగా లేని వ్యవస్థను పూర్తిగా కుదిపేసింది. నిజానికి ఆన్ లైన్ బోధనా విధానం యూనివర్శిటీ స్థాయిలో అక్కడక్కడ ఉంది. పాఠశాల స్థాయికి వచ్చేసరికి మాత్రం కేవలం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు ఉందే తప్ప… బోధన పూర్తిగా క్లాస్ రూంలకు దూరంగా ఎప్పుడూ జరగలేదు. అందుకే ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు కూడా ఇది పూర్తిగా కొత్త. టీచర్ల విషయానికొస్తే ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం ఉన్నవారు వెంటనే ఈ విధానంలో ఒదిగిపోయారు. క్లాస్ రూం బోధనకు మాత్రమే అలవాటు పడ్డవారు మాత్రం ఇబ్బంది పడ్డారు.

పిల్లల చదువులో 8 నుంచి ఇంటర్‌ వరకూ చాలా కీలకం. గతేడాది పదో తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు జరగలేదు. దీంతో పై క్లాసులకు ప్రమోట్ అయ్యారు. కానీ చాలారోజులు స్కూళ్లు నడిచాయి కాబట్టి పర్లేదనుకోవచ్చు. కానీ ఈ ఏడాది మాత్రం చాలావరకూ ఆన్‌లైన్ పాఠాలే జరిగాయి. ఫలితంగా పిల్లలకు చదువుపై గ్రిప్‌ పోయింది. 8,9,10, ఇంటర్‌లో చదివే పాఠాలే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఫౌండేషన్. ఈ తరగతుల్లో ఎంత విజ్ఞానం సంపాదించుకుంటే భవిష్యత్తు అంత బ్రైట్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ కనీసం బట్టీ అయినా కొట్టేవారు. కానీ ఇప్పుడు వారంతట వారు నేర్చుకోలేకపోతున్నారు… టీచర్లూ బట్టీ పట్టించలేకపోతున్నారు.

అసలు పిల్లలకు తాము చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయో లేదో టీచర్లకు తెలియదు.. ఆన్‌లైన్ పరీక్షలే కావడంతో పిల్లలు ఏదో రాస్తున్నారు. టీచర్లు ఏదో మార్కులేస్తున్నారు. సైన్స్‌, మెడిసిన్, కంప్యూటర్ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులను పరిగణలోకి తీసుకుంటే ప్రాక్టికల్స్‌ ముఖ్యం. రోజూ కుస్తీ పట్టాలి, తప్పులు చేయాలి… లెక్చరర్ల నుంచి డౌట్స్‌ తీర్చుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి… కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అసలు ఏమాత్రం ప్రాక్టీస్‌ లేకుండానే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి.

మరి ఇలాంటి పరిస్థితుల్లో పైతరగతులకు వెళ్లిన పిల్లలు భవిష్యత్‌లో కాంపిటీషన్‌ను తట్టుకోగలరా…? కొన్ని పెద్దపెద్ద స్కూళ్ల వరకూ పర్లేదు… పిల్లలపై కాస్తో కూస్తో కేర్ ఉంటోంది. కానీ మరి చిన్నచిన్న స్కూళ్లు, గవర్నమెంట్‌ స్కూల్‌ స్టూడెంట్స్ పరిస్థితేంటి…? మరి వీళ్లంతా రేపటి పోటీని తట్టుకోగలరా…? దెబ్బతిన్న ఫౌండేషన్ విద్యార్థుల్ని ఏ ఒత్తిడికి గురిచేయబోతోంది…? ఇక గంటలపాటు కంప్యూటర్లు, మొబైల్స్‌ ముందు కూర్చుని, కూర్చుని పిల్లల ఆరోగ్యం ఏమవ్వాలి…? అసలే పదోతరగతికి ముందే చాలామందికి కళ్లజోళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఐదో తరగతికే ఆ పరిస్థితి వస్తోంది. ఇక పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. పరుగులు తీసే కాళ్లు ఇప్పుడు కదలడం లేదు. ఇక కమ్యునికేషన్ స్కిల్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

ఇక కరోనా కాటేసిన విద్యావ్యవస్థలో మరో కోణం ఉంది. వందల స్కూళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. పిల్లలు స్కూళ్లకు రాక, ఫీజులు వసూలు కాక అంతా అస్తవ్యస్థం. చిన్నా చితకా ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితికిపోయాయి. విద్యార్థులనుంచి ఫీజులు వసూలు కాక, అటు టీచర్లకు జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టుకోలేక సతమతం అయ్యాయి. కొన్ని వేల ఉద్యోగాలు మాయమయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఇప్పుడు కూలిపనులకు వెళుతున్నారు. అక్షరాలు దిద్దించిన చేతులు బజ్జీలు వేస్తున్నాయి… అరటిపళ్లు అమ్ముకుంటున్నాయి. మిగిలిన టీచర్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది.

ఆన్‌లైన్ క్లాసులు చెప్పడమే కాదు పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసే బాధ్యతను టీచర్లపై మోపుతున్నాయి యాజమాన్యాలు. ఇక కార్పొరేట్ కాలేజీల పరిస్థితి మరీ దారుణం. వందలమంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు పిల్లల్ని కాలేజీలకు రమ్మనలేరు. వందలమంది ఉండే క్లాస్‌రూమ్‌ లేదా హాస్టల్‌లో ఒకరికి వైరస్‌ సోకితే మిగిలిన వారి పరిస్థితేంటన్న భయం… వైరస్ సోకిన విద్యార్థిని ఒంటరిగా ఉంచడం మరో సమస్య… ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్న టెన్షన్… ఇవన్నీ ప్రైవేట్‌ కాలేజీలకు పెద్ద సమస్యగా మారిపోయాయి.

మొత్తంగా చూస్తే కరోనా విద్యావ్యవస్థను ఓ కుదుపు కుదిపేసింది. రెండేళ్ల చదువును కరోనాకు అర్పించేసి పిల్లలు పైక్లాసులకు వెళుతున్నారు. మరి వీరు భవిష్యత్‌ పోటీని ఎలా ఎదుర్కొంటారో…? కరోనా ఇంకెన్ని రోజులు బడిబాల్యాన్ని మింగేస్తుందో…? విద్యావ్యవస్థనే ఏం చేస్తుందో..?