వైద్యుల్లో టెన్షన్ : విశాఖలో ఓ వ్యక్తి శరీరంలో 22 రోజులుగా కరోనా

  • Published By: veegamteam ,Published On : April 22, 2020 / 07:19 AM IST
వైద్యుల్లో టెన్షన్ : విశాఖలో ఓ వ్యక్తి శరీరంలో 22 రోజులుగా కరోనా

విశాఖలో ఇప్పటిదాకా నమోదైన 21 పాజిటివ్‌ కేసుల్లో ఓ కేసు వైద్యుల్ని టెన్షన్‌ పెడుతోంది. సాధారణంగా శరీరంలోని వైరస్‌ 14 రోజుల్లో తగ్గుముఖం పడుతుండగా… ఓ వ్యక్తికి మాత్రం గత 22 రోజులుగా అలాగే కొనసాగుతోంది. దీంతో అధికారులు, వైద్యులు కాస్త తర్జనభర్జనలో ఉన్నప్పటికీ.. చాలా తక్కువ మందిలో ఇలా కనిపిస్తుందని చెబుతున్నారు. వైరస్‌ ఎక్కువ రోజులు ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనిలేదని… రోగి చాలా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడిస్తున్నారు.

విశాఖ నగరం అక్కయ్యపాలేనికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి మార్చి నెల్లో ఢిల్లీ మర్కజ్‌ నుంచి విశాఖకు వచ్చారు. గతనెల 30వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అదేరోజు శాంపిల్స్‌ తీయగా 31న పాజిటివ్‌ అని తేలింది. కరోనా లక్షణాలు మాత్రం ఎక్కడా కనపడలేదు. ఆ తర్వాత గీతం ఆసుపత్రిలో 14వ రోజు, 15వ రోజు వైద్య పరీక్షలు చేయగా… రెండుసార్లూ మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. 

దీంతో నిబంధనల ప్రకారం అతడిని 28 రోజుల పాటూ ఆస్పత్రిలో ఉండాల్సిందేనని అధికారులు నిర్ణయించారు. శరీరంపై వైరస్‌ ప్రభావం ఇప్పటికీ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నా.. బయటికి మాత్రం దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏ లక్షణాలూ లేవన్నారు. దీంతో మొదట్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వలేదు. 14 రోజుల తర్వాత కూడా వైరస్‌ ఉందని తేలడంతో ఆ తర్వాత కోర్సు మొదలుపెట్టారు.

ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల్లో బాధితుడికి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగానే ఉన్నట్లు తేలింది. ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం బాగున్నాయి. చాలా తక్కువ మందిలో వైరస్‌ ఎక్కువ రోజులు ఉండే అవకాశముందని… ఇది శాస్త్రీయంగానూ నిర్ధారణ అయ్యిందని  వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ కేసుతో అధికారులకు, వైద్యులకు కొత్త చిక్కొచ్చి పడుతోంది. 

ఇతనిలో ఉన్న వైరస్‌ 28 రోజుల తర్వాత కూడా కొనసాగితే అప్పుడేం చేయాలనే దానిపై సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని, రోగికి కౌన్సెలింగ్‌ కూడా ఇప్పిస్తున్నామని అంటున్నారు. జిల్లాలో మొత్తం 21 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. ఇప్పటికే 19 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఈ రోగితో పాటు తాజాగా వచ్చిన మరో మహిళ చికిత్స పొందుతున్నారు.

కేరళలోనూ ఇలాంటి పేషెంట్‌ ఉన్నారు. పథనంతిట్ట జిల్లాకు చెందిన 62 ఏళ్ల మహిళ కరోనా బారిన పడి.. 42 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇటలీ వెళ్లొచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా ఆమెకు వైరస్‌ సోకింది. మార్చి 10న ఆమెకు పరీక్షలు చేయించారు. పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మామూలుగా చాలామంది 14 నుంచి 21 రోజుల వ్యవధిలో చికిత్సకు స్పందిస్తారు. 

కానీ, ఆమెకు ఇన్నాళ్లుగా చికిత్స చేస్తున్నా ఫలితం లేదు. ఇప్పటికి 19సార్లు ఆమెకు వైద్యపరీక్షలు చేయగా.. ప్రతిసారీ పాజిటివే వచ్చింది. అలాగని ఆమెలో దగ్గు, జ్వరం లాంటి ఇన్ఫెక్షన్‌ లక్షణాలు ఏమీ లేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు రకరకాల మిశ్రమాల్లో ఔషధాలను వాడి చూస్తున్నామని చెప్పారు. మరోసారి ఆమెకు పరీక్ష చేస్తామని.. అప్పుడు కూడా పాజిటివే వస్తే ఆమెను కొట్టాయంలోని వైద్య కళాశాలకు తరలిస్తామని డాక్టర్లు తెలిపారు.