విశాఖలో కరోనా పాజిటివ్ కేసు : ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల

10TV Telugu News

ఏపీలో కరోనా క్రమక్రమంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న 119 మందిలో 104 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. 12 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

విశాఖపట్టణంలో తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. మక్కా నుంచి మార్చి 10వ తేదీ నుంచి వచ్చిన ప్రయాణీకుడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతడి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. దీంతో కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. దీంతో అతడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డుకు పంపించి చికిత్స అందిస్తున్నారు. (చైనా సాధించింది.. లోకల్‌లో కరోనా కేసుల్లేవ్)

మక్కా నుంచి వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడ సంచరించాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతాలను రసాయనాలతో శుభ్రం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, ప్రజలు ధైర్యంగా ఉండాలని విశాఖ అధికార యంత్రాంగం సూచిస్తోంది. రిమ్స్‌తో పాటు ఇతర ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాల్స్‌లను బంద్ చేశారు.

దీంతో నగరంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసరమైతే..తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. గుంపులు గుంపులుగా తిరగొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలంటున్నారు. 

Read More : నిర్భయ తల్లిని శిక్షించాలి..దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు

10TV Telugu News