కర్నూలు జిల్లాలో కరోనా కలకలం… 13 మంది టెన్త్ విద్యార్థులకు పాజిటివ్

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం… 13 మంది టెన్త్ విద్యార్థులకు పాజిటివ్

Corona positive for 13 ssc students : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నక్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రుద్రవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. పదవ తరగతి చదువుతున్న 30 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా… అందులో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

విద్యార్థులకు కరోనా రావడంతో పాఠశాలకు వారం రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలలో చదువుతున్న మిగిలిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. కరోనా తగ్గుతున్న క్రమంలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది.

ఏపీలో నిన్న 458 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 534 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,819కు చేరింది. 8,66,359 మంది కోలుకున్నారు. మరో 4,377 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనాతో 7,070 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 69,062 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,11,34,359 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.