ఇకపై మొబైల్ ఫోన్‌కే కరోనా రిజల్ట్ .. ఏపీలో సరికొత్త విధానం

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 05:25 AM IST
ఇకపై మొబైల్ ఫోన్‌కే కరోనా రిజల్ట్ .. ఏపీలో సరికొత్త విధానం

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో కరోనాపై నెలకొన్న అభద్రతాభావం పొగొట్టేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం అందులో భాగంగా ఈ విధానం తీసుకొచ్చింది. సకాలంలో కోవిడ్‌ ఫలితాల సమాచారం అనుమానితులు, బాధితులకు అందేలా జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

అందుకు తగ్గట్టు ఫలితాలు వెళ్లేలా జిల్లా అధికారులు ‘అనంత’లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఏప్రిల్ 16న కలెక్టరేట్‌లో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి కలెక్టర్‌ గంధం చంద్రుడు ఎస్‌ఎంఎస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో ధైర్యాన్ని నింపే మెసేజ్, నెగిటివ్‌ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షలు చేసుకున్న వారికి సంక్షిప్త సమాచారం వెళ్తోంది.

మెసేజ్‌ ఇలా:
కోవిడ్‌ అని నిర్ధారణ అయిన వెంటనే బాధితుల సెల్‌ నంబర్‌కు కలెక్టర్‌ పేరు మీద మెసేజ్‌ వెళ్తుంది. కోవిడ్‌ పాజిటివ్‌ అయితే.. ‘ప్రియమైన వ్యక్తి పేరు, క్షమించండి. మీ ఐడీ కింద కోవిడ్‌ 19 పరీక్ష మీకు పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన వైద్య సేవలందింస్తుంది. మీరు కోవిడ్‌తో పోరాడి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్‌ అవుతారని’ సందేశం వస్తుంది. నెగిటివ్‌ అయితే..‘ డియర్‌.. (పూర్తి పేరు) నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఐడీ నంబర్‌ 2461 కోవిడ్‌ –19 పరీక్ష నెగిటివ్‌ వచ్చిందని’ సందేశం వస్తుంది.

5,547 మందికి నెగిటివ్, 59 మందికి పాజిటివ్‌:
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో ఫలితాలు తెలుపక మునుపు రెండు, మూడు రోజుల సమయం పట్టేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5,826 మంది ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం వెళ్లింది. అందులో 5,547 మందికి నెగిటివ్, 59 మందికి పాజిటివ్‌ అని తేలింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే స్థాయిలో ఫలితాలు సకాలంలో బాధితులకు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ లో శ్రీకారం చుట్టామని కలెక్టర్ తెలిపారు. పాజిటివ్, నెగిటివ్‌ వచ్చిన వెంటనే వారికి సమాచారం వెళ్తుందన్నారు.

ఏపీలో 1525 కరోనా కేసులు:
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. ఇప్పటివరకు 441 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1051. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది కరోనాతో మరణించారు.