బీ అలర్ట్.. రాష్ట్రంలో పొంచి ఉన్న కరోనా సెకండ్ వేవ్

బీ అలర్ట్.. రాష్ట్రంలో పొంచి ఉన్న కరోనా సెకండ్ వేవ్

వాతావరణ పరిస్థితులు.. రాష్ట్రంలో ప్రజలు విస్మరిస్తున్న జాగ్రత్తలు చూసి కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక దశలో రోజుకు 10 వేల వరకూ నమోదైన కేసులు క్రమంగా తగ్గి ప్రస్తుతం రోజుకు 600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తాజాగా అంచనా వేసింది. చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు రిపోర్టులో స్పష్టం అయింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అలర్ట్ కావాల్సిన అవసరముందని సూచించింది.

5 మాసాల గ్యాప్‌తో వచ్చే అవకాశం
పలు దేశాల్లో, రాష్ట్రాల్లో, ఢిల్లీలోనూ సంభవించిన కరోనా పరిస్థితులు అంచనా వేస్తే.. కరోనా పీక్‌‌లో ఉన్న దశ నుంచి ఐదు మాసాల గ్యాప్‌తోనే సెకండ్‌ వేవ్‌ వచ్చినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగష్టు – సెప్టెంబర్‌ నెలల్లో తీవ్రత ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గు ముఖం పట్టింది. ఐదు నెలల గ్యాప్‌లో 2021 జనవరి 15 నుంచి మార్చి 15 లోగా సెకండ్‌ వేవ్‌కు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు.. దేశంలో ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేశారు. ఏపీలో కచ్చితంగా వస్తుందని చెప్పలేమని, వచ్చేందుకు మాత్రం అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆ పరిస్థితులకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండటం మంచిదని, సెకండ్‌ వేవ్‌లో చాలా దేశాలు, రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారని తెలిపారు.

కరోనా సెకండ్‌వేవ్‌ అంచనా వేసేందుకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీ నియమించింది. ఇందులో నలుగురు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారు కాగా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వారు. ఈ కమిటీ సెకండ్‌వేవ్‌ అవకాశాలు, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిపోర్టు ఇచ్చింది.