Vaccination Free : ఏపీ, తెలంగాణలో ఉచితంగా వ్యాక్సినేషన్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి.

Vaccination Free : ఏపీ, తెలంగాణలో ఉచితంగా వ్యాక్సినేషన్

Corona Vaccination For Free In Ap And Telangana

corona Vaccination for free : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి. ఇప్పటికే టీకా ఫ్రీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించగా.. తాజాగా తెలంగాణ సర్కార్‌ కూడా ఉచిత వ్యాక్సినేషన్‌ అందిస్తామని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్‌ కేసులు, మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభవార్త చెప్పారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా కరోనా టీకా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.

రాష్ట్ర జనాభాతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పలు రంగాల్లో పనిచేస్తున్న జనాభా కలుపుకుని తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది దాకా ప్రజలు వున్నారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి వాక్సిన్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన వారందరికి వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతి ఒక్కరికి వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ కోసం సుమారు 2 వేల 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానుంది. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు. టీకా కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాల వారీగా ఇంచార్జులను నియమించనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమిడిసివిర్, కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు తెలంగాణలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజులోనే మహమ్మారి బారిన పడి 33 మంది మృతి చెందారు. 24 గంటల్లో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 432 కేసులొచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో 58 వేల 148 యాక్టివ్‌ కేసులున్నాయి. తెలంగాణలో గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై ఆరా తీశారు. గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో సౌకర్యాలపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఏ స్మశానం చూసినా కరోనా శవాలతో నిండిపోతోందన్నారు. కానీ ప్రభుత్వం లెక్కలు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు కూడా సర్కారు లెక్కల ప్రకారమే ఉంటుందని చెప్పారు కిషన్‌రెడ్డి.

ఇప్పటికే ఏపీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 18 ఏళ్ల నుంచి 48 ఏళ్ల వారందరికీ ఉచితంగా టీకా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం 16 వందల కోట్లు వెచ్చిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు. ఏపీలో 18 ఏళ్ల దాటిన వారు సుమారు నాలుగు కోట్ల మంది వరకు ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. వీరిలో సుమారుగా మూడున్నర కోట్ల మంది 18 నుంచి 45 వయస్సు లోపు వారు ఉంటారు.

ప్రస్తుతం వీరందరూ మే 1వ తేదీ నుంచి టీకా వేయించుకోవడానికి అర్హులు. వీళ్లందరికి వ్యాక్సిన్ ఫ్రీగా అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాల్సిందే. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 7కోట్ల డోసులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సీరం, భారత్‌ బయోటెక్‌ ఎండీలకు ఏపీ ప్రభుత్వం విడివిడిగా లేఖలు రాసింది. 4.08కోట్ల డోసులను సరఫరా చేయాలని ఆయా సంస్థలను కోరింది.

మరోవైపు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతోన్నాయి. వరుసగా రెండో రోజు 11 వేలకు పైగా కేసులు వచ్చాయి. 24 గంటల్లో 11 వేల 698 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 24 గంటల్లో కరోనాకు 37 మంది బలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఒక వెయ్యి 641 మందికి పాజిటివ్‌ వచ్చింది. గుంటూరు జిల్లాలో వెయ్యి 581, చిత్తూరు జిల్లాలో 13 వందల 6 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలోనూ కరోనా కొత్త కేసులు వేయిదాటాయి. తూర్పుగోదావరి, నెల్లూరులో 9 వందల మందికి పైగా పాజిటివ్‌ వచ్చింది.