క్వారంటైన్ సెంటర్ లో పాడైపోయిన ఆహారం…కరోనా అనుమానితుల ఆందోళన

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 06:58 AM IST
క్వారంటైన్ సెంటర్ లో పాడైపోయిన ఆహారం…కరోనా అనుమానితుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ క్వారంటైన్ సెంటర్ లో కరోనా వైరస్ అనుమానితులు ఆందోళన చేపట్టారు. పాడై పోయిన ఆహారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్యం లోపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపంతో దుర్గంధం వ్యాపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను కూడా క్వారంటైన్ సెంటర్ లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 200 మందిని ఒకే సెంటర్ లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాకినాడలోని జెఎన్ టీయూలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో కరోనా వైరస్ అనుమానితులు ఆందోళనకు దిగారు. ఐదు రోజుల క్రితం పెదపూడి మండలం గొల్లలమావిడాకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. ఆయన ప్రైమరీ కాంటాక్టు, సెంకడరీ కాంటాక్టును అధికారులు గుర్తించి సుమారు 400 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిని రాజమండ్రిలోని జీఎస్ ఎల్, కాకినాడలోని జెఎన్ టీయూలోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. 

జెఎన్ టీయూ క్వారంటైన్ సెంటర్ లో సుమారు 200 మంది గొల్లలమావిడికి చెందిన వారు ఉన్నారు. వారిలో 13 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. క్వారంటైన్ సెంటర్ కు తరలించినప్పటి నుంచి ఆహారం సరిగ్గా పెట్టడం లేదు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. పారిశుద్ధ్యం సరిగ్గా లేదు. 

కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఈవిధంగా ఉంటే కరోనా ఎలా పోతుందని ఆందోళనకు దిగారు. అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన 13 మంది అక్కడున్నట్లు తెలుస్తోంది. వారిని కూడా వేరే ఆస్పత్రికి 
తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెగెటివ్ వచ్చిన 200 మంది వ్యక్తులను కూడా ఇళ్లకు పంపందేకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ ఇంట్లో పరిశుభ్రంగా ఉంటామని, క్వారంటైన్ సెంటర్ లో మౌళిక వసతులు లేవని, నాసికరమైన ఆహారం పెడుతున్నారని 
వాపోయారు. 

బాత్ రూమ్స్ ను సరిగ్గా క్లీన్ చేయడం లేదు. పందులు కూడా తిరుగుతున్నాయని వాపోయారు. ఇలా ఉంటే కరోనాను ఎలా నియంత్రిస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడంతో గ్రామస్థులంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ క్వారంటైన్ కు తరలించి కనీస వసతులు కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.