సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా

  • Published By: bheemraj ,Published On : July 5, 2020 / 02:09 AM IST
సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా

ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద కరోనా కలకలం రేపింది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 10 మంది కానిస్టేబుల్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీఎస్ పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గ్వార్డులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

(జులై 2, 2020) సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహించిన అధికారులు ఆ ఫలితాలను శనివారం (జులై 4, 2020) వెల్లడించారు. గతంలోనూ సీఎం నివాసం వద్ద ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. తాజాగా కరోనా బారిన పడిన 10 మంది కానిస్టేబుల్స్ ను క్వారంటైన్ కు తరలించారు.

ఏపీలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,699కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 218కి పెరిగింది. రాష్ట్రంలో 9,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,008 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా నమోదైన కేసుల్లో 727 రాష్ట్రానికి చెందినవి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 6 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.