coronavirus : కోళ్లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 09:09 AM IST
coronavirus : కోళ్లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు. మొత్తానికి వదిలించుకుంటున్నారు. కోడిని చూస్తే కంగారు.. గుడ్డును తలుచుకుంటేనే గాబరా.. అసలు చికెన్‌ వైపు చూస్తే ఒట్టు.. కోడి  కూరను కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్లు కూడా.. ఇప్పుడా మాటెత్తడం లేదు. కరోనా రాకముందు  కొండెక్కి కోడి కూర ధర.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. బాయిలర్‌ కోళ్ల మార్కెట్‌ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. రేటు మరీ దారుణంగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగానికి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది.  

కొన్ని చోట్లయితే కోళ్లు పైసా విలువ చేయడం లేదు. కరోనా భయంతో ఎవ్వరూ కోళ్లను కొనకపోవడంతో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా పంచిపెడుతుంటే..ఇంకొన్నిచోట్ల కోళ్లను వదిలించుకోలేక గొయ్యి తీసి సజీవంగా పాతిపెడుతున్నారు. మొన్నటిదాకా ముక్కను లోట్టలేసుకుంటూ కొరికిన చికెన్‌ ప్రియులంతా ఇప్పుడు  కోడికూర పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. చికెన్‌ షాపులవైపే చూడటం లేదు. దీంతో తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా చికెన్‌ ధరలు మునుపెన్నడూ లేనంతగా  పడిపోయాయి. 

తెలంగాణలోని పలుచోట్ల బ్రాయిలర్‌ కోళ్లను కిలో 11 చొప్పున కొనాలని ట్రేడర్స్‌ నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో కిలో చికెన్‌ 20కి అమ్ముతున్నారు. దాణా ఖర్చు తట్టుకోలేక నల్గొండ జిల్లాలో ఉచితంగా జనాలకు కోళ్లను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు గుడ్లకీ ఇదే పరిస్థితి ఒకప్పుడు 355 నుంచి 400 వరకు పలికిన వంద కోడి గుడ్ల ధర.. ఇప్పుడు భారీగా దిగొచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ దాదాపు 8వేల కోట్ల వరకూ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. చికెన్‌ ధరలు అమాంతం పడిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చేసేదేమీ లేక వేలాది కోళ్లను సజీవంగానే ఖననం చేస్తున్నారు. (కరోనా లక్షణాలతో కేరళ నుంచి తప్పించుకోలేరు… దక్షిణకొరియా తరహాలో ప్రతిఒక్కరినీ ట్రాక్ చేసి, ట్రీట్ చేస్తారు)

సాధారణంగా 45 రోజుల్లో  రెండు కిలోల బరువు రాగానే కోళ్లను అమ్ముతుంటారు. అయితే కరోనా ప్రభావంతో గత రెండు నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ ఘోరంగా దెబ్బతింది. కోడికూర తింటే కరోనా వస్తుందన్న పుకార్లు జోరుగా ప్రచారం అవుతున్న క్రమలో… చికెన్ తినేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో ఫారంలోనే కోళ్లు ఉండిపోతున్నాయి. అమ్మకం కాక పోవడంతో.. వాటి మేతరకు రోజుకు భారీగా ఖర్చు అవుతోంది. కిలో బ్రాయిలర్‌ కోడి పెంపకానికి 80 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి నాలుగు రూపాయలు ఖర్చు అవుతునట్లు తెలుస్తోంది. 

ధరల పతనంతో రైతులు కిలో కోడిపై దాదాపు 70 రూపాయల వరకూ నష్టపోతున్నాడు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల రైతులు 2వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా.. ప్రజల్లో అవగాహన పెరిగితే తప్ప పౌల్ట్రీ రంగం గట్టెక్కే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్‌, గుడ్ల వినియోగంతో ఎవరికీ కరోనా వైరస్‌ సోకదు. ఇదంతా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారమని పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. 

Read More : ప్రేక్షకులు లేకుండానే..IPL మ్యాచ్‌లు!