తేరుకుంటున్న ఏపీ.. 3రోజులుగా మరణాల్లేవు, ఆరు జిల్లాల్లో కేసుల్లేవు!

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 12:30 PM IST
తేరుకుంటున్న ఏపీ.. 3రోజులుగా మరణాల్లేవు, ఆరు జిల్లాల్లో కేసుల్లేవు!

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్‌–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ స్పష్టం చేస్తోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 5,783 మందిని పరీక్షించారు. వారిలో కొత్తగా 82 కేసులు పాజిటివ్‌ తేలింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,259కి చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 40 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 332కు చేరింది.

గుంటూరు జిల్లాలో 17 నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 13 కేసులు పాజిటివ్‌గా తేలాయి.. వైఎస్సార్‌ కడప జిల్లాలో 7, నెల్లూరు 3, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కొత్తగా ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 970 యాక్టివ్ కేసులు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 23 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 12 మంది, గుంటూరు 10, నెల్లూరులో ఒకరు డిశ్చార్జీ అయినవారిలో ఉన్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 258కి చేరింది.
ష్ట్రంలో మొత్తం ఆరు జిల్లాల్లో మంగళవారం ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల కేంద్రంగానే వైరస్‌ పెరుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు కూడా రెడ్‌జోన్లలోనే ఉన్నాయని అధికారులు అంటున్నారు. మంగళవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 85.3 శాతం కూడా ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే గడిచిన 24 గంటల్లో మొత్తం 6,908 టెస్టులు చేయగా 40 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల్లో 26.37 శాతం ఆయా జిల్లాలోనే ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే 64.25 శాతంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80,334 టెస్టులు చేయగా అందులో 22,179 టెస్టులు ఈ మూడు జిల్లాల్లో నుంచే వచ్చాయి. ఈ మూడు జిల్లాల్లో చేసిన టెస్టుల శాతం 27.6 శాతంగా ఉంది. రాష్ట్రంలో నెగిటివ్‌ వచ్చిన శాతం 98.43గా నమోదైంది. మంగళవారం నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల శాతం 1.57గా ఉంది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు కర్నూలులో 332 నమోదు అయ్యాయి. కోలుకుని రికవరీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాగా విశాఖ నిలిచింది. విశాఖ జిల్లాలో 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. 19 మంది పూర్తిగా కోలుకున్నారు. రికవరీ శాతం 86.36గా ఉంది. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలోని మండలాలన్నీ గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.