నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 04:55 AM IST
నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ

తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడీ చేసిన ఆదేశాలను కింది సిబ్బంది తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

భక్తులను కొండపైకి అనుమతించడం లేదు. తిరుమలలో కొన్ని పెళ్లిళ్లు జరుగుతున్నట్లు సమాచారం. పెళ్లిళ్లలో పరిమితికి మించిన వారిని మాత్రమే అనుమతినిస్తున్నారు. మైక్‌ల్లో అధికారులు పలు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు. టీటీడీలో పనిచేసే సిబ్బంది కోసం బస్సులు ఏర్పాటు చేసినట్లు, వీరిని పైకి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఐడీ కార్డులున్న వారిని మాత్రమే లోనికి అనుమతినిస్తున్నారు. 

తిరుమలలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో తిరుమల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టీటీడీ అత్యవసరంగా భేటీ అయ్యింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పైకి వచ్చే ఘాట్ రోడ్డు మూసివేయాలని, ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలను నిషేధించారు. కొండపై ఉన్న భక్తులను కిందకు పంపించేశారు. వీరు వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్డును మాత్రమే తెరిచి ఉంచారు. మరోవైపు పలు ఆలయాలను అధికారులు మూసివేస్తున్నారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, పద్మావతి అమ్మవారు, గోవిందరాజ స్వామి, శ్రీనివాస మంగాపురం ఆలయాలను కూడా బంద్ చేశారు. మొత్తానికి భక్తుల సందడి లేకపోవడంతో ఆలయాలు బోసిపోతున్నాయి. 

Read More : తెలంగాణలో కరోనా : నల్గొండలో వియత్నాం వాసులు..గాంధీకి తరలింపు