ఏపీని టెన్షన్‌ పెడుతోన్న కరోనా…24 గంటల్లో 19 పాజిటివ్‌ కేసులు

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : April 10, 2020 / 12:33 AM IST
ఏపీని టెన్షన్‌ పెడుతోన్న కరోనా…24 గంటల్లో 19 పాజిటివ్‌ కేసులు

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 363కి చేరింది. నిన్న కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1, కడప జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకు మర్కజ్‌ సదస్సుతో సంబంధం ఉండటంతో.. అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఏపీలో నిన్న కరోనా ఇద్దరిని బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో  మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని నరసరావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి టీబీ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతి చెందిన అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆర్డీవో వెల్లడించారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులను అధికారులు క్వారంటైన్‌కు  తరలించారు. అటు కరోనా పాజిటివ్‌తో రెండ్రోజుల క్రితం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అతను చనిపోయిన తరువాత కరోనా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే అతని కుటుంబ సభ్యులను అధికారులు కల్యాణదుర్గం పట్టణంలోని క్వారంటైన్‌కు తరలించారు. వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు హాఫ్‌ సెంచరీ దాటాయి. జిల్లాలో మొత్తం 51  కేసులు నమోదయ్యాయి. మర్కజ్‌ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లివచ్చినవారి వల్లే కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విదేశీ ముస్లింలు గుంటూరు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.  సత్తెనపల్లిలోని ఓ మసీదులో దాక్కున్న 10మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు పంపించారు.వీసా నిబందనలు ఉల్లంఘించిన కజకిస్తాన్‌ వాసులపై కేసులు నమోదు చేశారు. ఆరోగ్య విపత్తు చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కర్నూలు జిల్లా వాసులను కరోనా కలవరపెడుతుంది. ఏపీలో అత్యధికంగా 75 కేసులు కర్నూలు జిల్లాలోనే  నమోదయ్యాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశారు అధికారులు. అటు నెల్లూరులో 48, కృష్ణా జిల్లాలో 35, కడప 29, పశ్చిమ గోదావరిలో 22, చిత్తూరు  జిల్లాలో 20, విశాఖపట్నంలో 20, అనంతపురంలో 13 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.     

కరోనా దెబ్బకు ప్రకాశం జిల్లా విలవిలలాడుతుంది. గురువారం ఒక్కరోజే 11 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే రెండో స్టేజి నుంచి మూడో స్టేజీకి చేరుతుందని అధికారులు చెప్పడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఇంకా 100కు పైగా రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రిపోర్ట్స్‌ ఎంతమందికి పాజిటివ్‌ వస్తుందో.. వారు ఎవరెవరని కాంటాక్ట్‌ అయ్యారోనన్న విషయం ప్రకాశం జిల్లా అధికారులను టెన్షన్ పెడుతుంది.

Also Read | తెలంగాణలో 471కి చేరిన కరోనా కేసులు…12 మంది మృతి