Covid-19 Effect Simhadri Temple : అప్పన్నస్వామి ఆలయంపై కరోనా ఎఫెక్ట్.. 6 రోజులు దర్శనాలు నిలిపివేత

కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడుతోంది. వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆలయ అర్చకులు, సిబ్బంది కోవిడ్‌ బారిన పడటంతో దర్శనాలపై ఆంక్షలు తప్పడం లేదు.

Covid-19 Effect Simhadri Temple : అప్పన్నస్వామి ఆలయంపై కరోనా ఎఫెక్ట్.. 6 రోజులు దర్శనాలు నిలిపివేత

Covid 19 Effect Simhadri Temple

Covid-19 Effect Simhadri Temple : కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడుతోంది. వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆలయ అర్చకులు, సిబ్బంది కోవిడ్‌ బారిన పడటంతో దర్శనాలపై ఆంక్షలు తప్పడం లేదు. ఇక ఈ నెల 14న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం వరాహ లక్ష్మీనారసింహుడి చందనోత్సవం ఈ ఏడాది ఏకాంతంగానే జరగనుంది. కరోనా విజృంభణ కారణంగా ఏకంగా 6 రోజుల పాటు దర్శనాలను కూడా నిలిపివేశారు. గత నెల రోజులుగా విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు దాదాపు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం. అయినా ఈ మహమ్మారి ఎఫెక్ట్ ప్రజలతో పాటుగా సింహాచల దేవస్థానంపై కూడా పడింది. ఇప్పటికే వరాహ నారసింహుడి కళ్యాణం కరోనా భయంతో ఏకాంతంగా నిర్వహించారు అధికారులు. ఇప్పుడు చందనోత్సవం కార్యక్రమం కూడా ఏకాంతంగానే జరగనుంది. కరోనా విజృంభణ కారణంగా ఈ నెల 14న జరిగే చందనోత్సవాన్ని కూడా ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కేసుల పెరుగుదలతో నేటి నుంచి 16వ తేదీ వరకు దేవస్థానంలోకి భక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే దేవస్థానంలో కరోనా నివారణ చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టారు అధికారులు. సింహాచల దేవస్థానంలో దాదాపు 22 మంది అర్చకులు ఉన్నారు. వీరు కాకుండా ఇతర సిబ్బంది వెయ్యి వరకూ ఉంటారు. గత రెండు రోజులుగా దేవస్థానం సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటికే దేవస్థానంలోపల కూడా హైడ్రో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేశారు. ఈ నెల 5 నుంచి పాక్షిక లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో స్వామి కల్యాణం కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించినట్టే.. ఇప్పుడు చందనోత్సవాన్ని కూడా అదే బాటలో చేపట్టనున్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం చందనోత్సవ ప్రత్యేక పూజను నిజరూప స్వామి ఎదురుగా నిర్వహించాలని నిర్ణయించారు.

వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దర్శనాలు లేకపోయినా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి అన్ని వైదిక కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని వివరించారు.సాధారణంగా చందనోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా లాంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. స్వామివారి నిజరూప దర్శనం అనంతరం గిరిప్రధక్షణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితులలో భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో గుమిగూడటం మంచిది కాదన్న ఆలోచనతో.. చందనోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.