COVID AP: ఆగస్ట్ నాటికి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు.. తగ్గిన కరోనా కేసులు

COVID AP: ఆగస్ట్ నాటికి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు.. తగ్గిన కరోనా కేసులు

Covid 19 Pandemic In Andhra Pradesh

కరోనా సెకండ్‌ వేవ్.. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది.. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికే ఆసుపత్రుల్లో డాక్టర్లు యుద్ధాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కేసుల్లో తగ్గుదల కనిపించింది. అయితే, మరణాలు, పాజిటివిటీ రేటు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు టెస్టుల సంఖ్య బాగా తగ్గింది. 24 గంటల్లో 58 వేల మందికి పరీక్షలు చేస్తే.. అందులో 12 వేల 994 కేసులొచ్చాయి.

శనివారం 92 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 18 వేల కరోనా కేసులు పాజిటివ్‌గా తేలాయి. అంతకు ముందు ప్రతిరోజూ 20 వేలకు తగ్గకుండా కేసులు వస్తుండేవి. ఇప్పుడు 24 గంటల్లో కేసుల సంఖ్య తగ్గింది. ఏపీలో మరణాలు మాత్రం తగ్గట్లేదు. గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతీరోజూ వంద మరణాలు సంభవిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదే‌శ్‌లో కోవిడ్‌, వ్యాక్సినేషన్‌, బ్లాక్‌ఫంగస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఆక్సిజన్‌ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి కల్లా ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు.

సొంతంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పే ప్రైవేట్‌ ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్‌ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యానికి తగినట్లుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కోవచ్చన్నారు జగన్‌

యాస్‌ తుపాను వల్ల ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జగన్‌ ఆదేశించారు. రోజువారీ సరఫరా, నిల్వలపై దృష్టిపెట్టాలని సూచించారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ రోగుల తరలింపుపైనా అధికారులకు జగన్‌ పలు సూచనలు చేశారు. తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని జాగ్రత్తగా తరలించాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్‌ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే వెంటనే తరలింపుమ మొదలుపెట్టాలన్నారు.

కార్పొరేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాలని సూచించారు జగన్‌. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ నాణ్యంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణపై ఓ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితులపై బ్లాక్‌ ఫంగస్‌తోపాటు కొత్తగా వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసురుతుండడంతో.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లోనూ కరోనా కారణంగా 96 మంది మరణిస్తే.. అందులో అత్యధికంగా చిత్తూరులో 14 మంది ఉన్నారు. అనంతపురంలో 9, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 8 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురి చొప్పున కరోనా బలి తీసుకుంది.

మరోవైపు ఏపీలో రికవరీ రేటు స్వల్పంగా పెరుగుతోంది. ఒక్కరోజులో 18 వేల 373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం ఊరట కల్గించే అంశంగా ఉన్నా.. పాజిటివిటీ మాత్రం తగ్గట్లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 3 వేల యాక్టివ్ కేసులున్నాయి. అయితే.. టెస్టులు తగ్గించడం వల్లనే కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. మరిన్ని టెస్టులు చేస్తే.. కేసులు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.