హాస్పటల్, హోటల్ యాజమాన్యాలపై కేసులు నమోదు

  • Published By: murthy ,Published On : August 9, 2020 / 04:03 PM IST
హాస్పటల్, హోటల్ యాజమాన్యాలపై కేసులు నమోదు

కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని చెప్పారు. దీనికి అనుమతులు ఇచ్చిన విషయమై పూర్తిస్ధాయిలో దర్యాప్తు జరుపుతామని ఆయన అన్నారు.

మంత్రి ఒక ప్రశ్నకు జవాబిస్తూ 40 బెడ్లున్నట్లు నిర్ణయించిన తరువాతే రమేష్  ఆసుపత్రి కి  అనుమతి ఇచ్చామన్నారు. ఈ ఉదయం జరిగిన దుర్ఘటన నిర్లక్ష్యం వలనే జరిగిందని,  ఇప్పటికే హోటల్, ఆసుపత్రి యజన్యమాన్యాలపై … 304, 308, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆళ్ళ నాని తెలిపారు.

అగ్ని ప్రమాదంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. అగ్ని ప్రమాదంలో మరణించిన 10మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. 21 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని నాని వివరించారు.

కాగా….రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం ఓ హోటల్‌ను అద్దెకు తీసుకుని దాన్ని లాడ్జిగా మార్చి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. అయితే కరోనా పేషెంట్ల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు అధికారులు గుర్తించడంతో పాటు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అగ్ని ప్రమాదం అనంతరం వివరాలను తెలుసుకునే క్రమంలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించినట్లు తేలింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రమాద ఘటనతో పాటు అవతవకలపై విచారణకు ఆదేశించింది.