16 గంటల పాటు ఇంట్లోనే కరోనా మృతదేహాం, సహాయం చేయని బంధువులు

  • Published By: murthy ,Published On : July 24, 2020 / 05:23 PM IST
16 గంటల పాటు ఇంట్లోనే కరోనా మృతదేహాం, సహాయం చేయని బంధువులు

కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు.

కృష్ణా జిల్లాలో  ఒక వ్యక్తి మరణిస్తే అతను కరోనాతో మరణించాడని భయపడి అతనికి దహన సంస్కారాలు చేయటానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. సామాజిక కార్యకర్తల సాయంతో స్ధానిక పోలీస్ ఇన్సెక్టర్, ఎమ్మెల్యే అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యం పలువురిని కలిచి వేసింది.

కృష్ణాజిల్లా నాగాయలంకలో తొలి కరోనా మరణం గురువారం సంభవించింది. గ్రామంలోని కరకట్ట వద్ద నివాసం ఉండే 42 ఏళ్ల యువకుడు గురువారం తెల్లవారు ఝూమున కన్నుమూశాడు. సుమారు 2 గంటల సమయంలో మరణించి ఉంటాడని భావిస్తున్నారు.

స్దానికంగా ఉన్న బట్టల కొట్లకు ఇతర ప్రాంతాల నుంచి అతను సరుకు తీసుకు వస్తుంటాడు. నాగాయలంకలోని పలు వస్త్రదుకాణాల్లో సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరణించిన యువకుడు 3 రోజుల క్రితం కరోనా టెస్ట్ కు శాంపిల్ ఇచ్చాడు. ఇంత వరకు వాటి ఫలితాలు రాలేదు. కరోనా టెస్ట్ చేయించుకున్నాడని తెలిసి ఇంటి ఓనర్ అతడిని ఇల్లు ఖాళీ చేయించాడు.

దీంతో గత్యంతరం లేక కట్ట మీద అతడి తల్లి నివసించే ఇంట్లో భార్య, కుమార్తెతో కలసి ఉంటున్నాడు. తెల్లవారుజామున చనిపోవడంతో బంధువులు అటువైపు రాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

వారి బంధువులకు ఎమ్మెల్యే నచ్చ చెప్పినా ఎవరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకు రాలేదు. దీంతో విజయవాడ నుంచి ఇద్దరు సిబ్బందిని రప్పించారు. వీరికి తోడుగా నాగాయలంక ఎస్సై చల్లా కృష్ణ, ఇద్దరు సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకట నారాయణ లు ప్రత్యేక పీపీటీ దుస్తులు ధరించి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ లో శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

16 గంటలపాటు శవాన్ని బయటకు తీయటానికి కూడా ఎవరూ ముందుకు రాని హృదయవిదారక దృశ్యం పలువురిని కలిచి వేసింది. అనంతరం మృతుడి భార్యకు కరోనా ర్యాపిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఆ ఏరియాలో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్‌ చల్లించారు.