విశాఖ ఉక్కు ఉద్యమంలో సీపీఐ నేత నారాయణ ఆసక్తికర ప్రతిపాదన

విశాఖ ఉక్కు ఉద్యమంలో సీపీఐ నేత నారాయణ ఆసక్తికర ప్రతిపాదన

CPI leader Narayana Interesting proposal : విశాఖ ఉక్కు ఉద్యమంలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఒకే వేదికపై గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు దర్శనమిచ్చారు. మరోవైపు ఉక్కు ఉద్యమం కేంద్రంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు అవంతి శ్రీనివాసరావు.. జగన్‌ను, గంటా శ్రీనివాసరావు.. చంద్రబాబును ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు.

రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగాలన్నారు నారాయణ. ప్లాంట్ నష్టాల్లో ఉంటే ప్రైవేట్ వాళ్లు ఎందుకు కొంటారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను సాధించుకునే వరకూ రాజకీయ విమర్శలకు విరామం ఇవ్వాలన్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉద్యమం కొనసాగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించాలన్నారు.

దక్షిణాదిలో పట్టు లేదు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు మద్దతు తెలిపిన ఆయన.. చేయి చేయి కలిపి విశాఖ ఉక్క కర్మాగారాన్ని కాపాడుకుందామన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానన్నారు. స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని కొందరు అంటున్నారని… స్పీకర్‌ ఏ ఫార్మాట్‌లో కోరితే ఆ ఫార్మాట్‌లో ఇస్తున్నానన్నారు. ఈ మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 12, 2021)న మరోసారి కార్మికుల ఎదుటే రాజీనామా చేశారు.

కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మికసంఘాల రిలే నిరాహారదీక్షలో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు.