విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి : బీవీ రాఘవులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి : బీవీ రాఘవులు

BV Raghavulu responds to privatization of Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ను.. బీజేపీ ప్రభుత్వం రహస్యంగా అమ్మేయాలని చూస్తోందన్నారు. వెంటనే.. ఏపీ అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలన్నారు. పార్టీలకతీతంగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని పిలుపిచ్చారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తీవ్రమైన ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం కాల్పులు జరిపి 32 మందిని పొట్టనపెట్టుకుందని చెప్పారు. ఆ త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ఆ రోజు శాసనసభలో ఉంటే అనేక పార్టీల వారు, వామపక్షాల శాసన సభ్యులు రాజీనామాలు చేశారని తెలిపారు.

ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యమం, త్యాగాల ఫలితంగా, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ఒక్క కలం పోటుతో ప్రైవేటీకరణ చేస్తున్నామనడం దుర్మార్గమైన విషయమన్నారు. బీజేపీ విద్రోహం చేస్తోందని విమర్శించారు.

మొత్తం ప్రభుత్వరంగాలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అనేక దేశాలు దివాళా తీసిన ప్రైవేట్ రంగ పరిశ్రమలను ప్రభుత్వ రంగం పరిశ్రమలుగా మార్చి నడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మనదేశంలో బాగా నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.