బర్డ్ ఫ్లూనేనా..? : గుంటూరు జిల్లాలో మూడు రోజుల నుంచి చనిపోతున్న కాకులు

బర్డ్ ఫ్లూనేనా..? : గుంటూరు జిల్లాలో మూడు రోజుల నుంచి చనిపోతున్న కాకులు

Crows dying for three days in Guntur : భారత్‌కు కొత్తగా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. అసలే కరోనా కరోనా కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న భారత్‌లో ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ ఎంటర్‌ అయింది. కరోనా నుంచి ఇంకా కోలుకోకముందే బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. దీని కారణంగా లక్షలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వేలాది పక్షులను చంపి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కాకులు.. కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో వేలాది బాతులు మరణించాయి. ముందుజాగ్రత్తగా పెద్ద మొత్తంలో పక్షులను చంపేసి పూడ్చిపెడుతున్నారు అధికారులు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పక్షులు చనపోవడం కలకలం రేపింది. గుదిబండివారి పాలెం ప్రాథమిక పాఠశాలలో ఆరు కాకులు మృతి చెందాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మూడు రోజుల నుంచి కాకులు చనిపోతున్నాయని స్థానికులు తెలిపారు. ఇక అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రజలెవ్వరు భయపడవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బర్డ్ వైరస్ మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడింది. ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లుకూడా ఈ వైరస్ కు గురై మృత్యువాతపడుతున్నాయి.

హర్యానాలో గత పది రోజుల్లో 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే నాలుగు లక్షలకు పైగా కోళ్లు మరణించటంతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.దీంతో అధికారులు కొన్ని కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్‌కు పంపించారు.

కానీ ఇప్పటి వరకూ..ఏవియన్ ఇన్‌ఫ్లూయెండా బయటపడలేదు. కానీ..ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయేంజా కేసులు బయటపడ్డాయి. మంగళవారం జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో కూడా కొన్ని బయటపడ్డాయి.