అకాల వర్షాలతో తీరని నష్టం : పిడుగుపాటుతో ముగ్గురు మృతి

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 02:22 AM IST
అకాల వర్షాలతో తీరని నష్టం : పిడుగుపాటుతో ముగ్గురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన వానలకు… వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో  తేలికపాటి నుంచి ఓ మోస్తరు  వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణలోని  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది.  ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటపాటు కురిసిన వర్షానికి వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇక కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, మోటకొండూర్‌, ఆలేరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీగా వడగళ్లు పడడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. మామిడి తోటల్లో మామిడికాయలు నేల రాలాయి. దాదాపు గంటపాటు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరిపంట నేలపాలైంది. 

ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. భువనగిరి, ఖమ్మం, నేలకొండపల్లి, హుస్నాబాద్‌, కల్వచర్ల కొనుగోలు కేంద్రాల్లో 30వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

ఈదురుగాలులకు హుస్నాబాద్‌లో హోర్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. వరంగల్ అర్బన్‌ జిల్లా  ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో 45 గొర్రెలు చనిపోయాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తక్షణమే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులకు న్యాయం  జరిగేలా చూడాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. రెండు గంటలపాటు కురిసన వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపునీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ వడగళ్ల వాన కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో  తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.