Corona : హృదయవిదారకం.. కరోనా అని తెలిసినా.. కొనఊపిరితో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్లి నీరు తాగించిన కూతురు..

Corona : హృదయవిదారకం.. కరోనా అని తెలిసినా.. కొనఊపిరితో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్లి నీరు తాగించిన కూతురు..

తండ్రికి కరోనా.. చివరి క్షణాల్లో కూతురి ఆరాటం

Corona Positive : కరోనావైరస్ మహమ్మారి.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. మన ఇంట్లో వాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింది. కోవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి విలవిలలాడిపోయింది. తల్లి వద్దని వారిస్తున్నా తండ్రి దగ్గరికి వెళ్లింది. తండ్రి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే అతడు మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం(మే 2,2021) చోటు చేసుకుంది.

జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకునే వాడు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశాడు. కాగా, స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ గుడిసెలో ఉండాలని చెప్పారు. వారు అలానే చేశారు. ఇంతలో అసిరి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కింద పడిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కట్టుకున్న భార్య సైతం దగ్గరికి వెళ్లే సాసహం చెయ్యలేకపోయింది.

కరోనా భయంతో స్థానికులు కూడా దగ్గరికి వెళ్లలేకపోయారు. కళ్ల ముందు కన్నతండ్రి పరిస్థితి చూసిన కూతురి మనసు విలవిలలాడింది. కరోనా భయంతో తల్లి వద్దంటున్నా వినకుండా.. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక.. అతడి దగ్గరగా వెళ్లింది. తండ్రి గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కరోనా ఎలాంటి దయనీయ పరిస్థితులు తీసుకొచ్చింది అని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని విలపించారు.