బెట్టింగ్‌ భూతానికి ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి..కాలేజీ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం

బెట్టింగ్‌ భూతానికి ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి..కాలేజీ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం

Engineering student suicide : బెట్టింగ్ మోజులో పడి యువత ఆర్థికంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూసి ఉసురు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు, ఆశయాలను తుంచేస్తూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలి తీసుకుంది. చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శాంతిపురం మండలం రాళ్లబూదుగురుకు చెందిన కిరణ్.. కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కొందరు విద్యార్థులు బెట్టింగ్ కడుతూ సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం గమనించిన కిరణ్‌.. తాను బెట్టింగ్ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని భావించి జూదానికి అలవాటు పడ్డాడు.

ముందు బాగానే అనిపించడంతో అందులో డబ్బులు ఎక్కువగా పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వందలు వేలుగా మారాయి. తొలుత డబ్బు వచ్చిందని ఆనందపడ్డ కిరణ్.. తర్వాత నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పుల్లో కూరకుపోయాడు. చివరకు కిరణ్ తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు. కొద్ది రోజులుగా స్నేహితులతో కూడా సరిగా మాట్లాడకుండా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెట్టింగ్‌ కోసం చేసిన అప్పుల వేధింపులు తట్టుకోలేకపోయాడు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తనలాగా ఎవరూ బెట్టింగ్ చేయకండి అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు కిరణ్‌. బెట్టింగ్ వల్ల జీవితాలను చిదిమేసుకోకండి అని కోరాడు. ఈ పోస్ట్ చేసిన 8 గంటల తర్వాత కుప్పం మండలం బంగారునత్తం రోడ్డులోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కిరణ్ మృతితో అతని తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇటు కిరణ్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.