Corona Tests AP : ఏపీలో కరోనా పరీక్షల్లో జాప్యం..పెండింగ్‌లో 8 వేల మంది రిపోర్ట్స్

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ -19 టెస్టులపై గందరగోళం నెలకొంది. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Corona Tests AP : ఏపీలో కరోనా పరీక్షల్లో జాప్యం..పెండింగ్‌లో 8 వేల మంది రిపోర్ట్స్

Corona Tests Ap

Delay in corona tests in AP : ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ -19 టెస్టులపై గందరగోళం నెలకొంది. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు వ్యాధి లక్షణాలు కనిపించి అవస్థలు పడుతున్న కొందరు….మరోవైపు సిప్టంమ్స్‌ లేకుండానే అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నా మరికొందరు. దీంతో పరీక్షల కోసం జనం క్యూ కడుతున్నారు. కరోనా టెస్టుల్లో జాప్యంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రిపోర్టులు ఇవ్వడంలో కూడా లేట్ అవడంతో వైద్యం తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది. దీంతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.

విజయనగరం జిల్లాలో కరోనా టెస్ట్ రిపోర్ట్స్ రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 4వేల టెస్టులు చేస్తున్నారు. అయితే వీటి ఫలితం రావడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతోంది. కొంత మందికి ఐదు రోజులు గడిచినా…రిపోర్ట్స్ అందడం లేదు. ఆర్టీపీసీఆర్ విధానం వల్ల ఆలస్యం అవుతోందంటున్నారు. యాంటిజెన్, ర్యాపిడ్ టేస్టులు అందుబాటులోకి రాలేదు. మహారాజా ఆసుపత్రిలో ప్రతీ రోజూ 2వేల మందికి పరీక్షలు చేస్తున్నారు. వీటిని నెల్లిమర్లలో మిమ్స్‌ ఆసుపత్రి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. అక్కడ రెండు షిప్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే సరిపడా ల్యాబ్ సిబ్బంది లేకపోవడంతోనే ఆలస్యం అవుతోందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి.

కర్నూలులోనూ టెస్టుల్లో ఆలస్యం అవుతోంది. పరీక్ష కేంద్రాల దగ్గర జనం భారీ క్యూ కడుతున్నారు. అయితే రోజూ మూడు వేల 500 నుంచి నాలుగు వేల వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. 24 గంటల్లోనే రిజల్ట్ ఇస్తున్నామన్నారు. ఎక్కడా పెడింగ్ లేదన్నారు. పరీక్షలు చేసిన మరుసటి రోజే ఫలితాలు ఇస్తున్నామన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయకూడదని నిబంధనలు ఉన్నందున చేయడం లేదన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గౌరీశ్వర అన్నారు. ప్రతిరోజు ఆరువేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు వందలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మూడు వందలు, ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో 500 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని వెల్లడించారు. ఒక రోజులో చివరి దశలో జరిగే పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన సమయంలో కేవలం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామని గౌరీశ్వర తెలిపారు.

అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం వరకు ప్రతీ రోజే 4 వేల కోవిడ్ టెస్ట్ చేశామని…ప్రస్తుతం 5 వేల కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు జిల్లా వైధ్యాధికారి. ఇప్పటి వరకు రిపోర్ట్స్ పెండింగ్‌లో లేవన్నారు. 24 గంటల్లో కోవిడ్ టెస్ట్ రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్ కేసుల్లో మాత్రమే ర్యాపిడ్ టెస్టులు చేయడానికి పర్మిషన్ ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి 13 లక్షల టెస్టులు చేశామని జిల్లా వైధ్యాధికారి కామేశ్వర ప్రసాద్ తెలిపారు.