ఒకప్పుడు ఒంటి చేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది, ఇప్పుడు చంద్రబాబు కారణంగా ఒంటరైపోయారు

  • Published By: naveen ,Published On : October 22, 2020 / 11:34 AM IST
ఒకప్పుడు ఒంటి చేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది, ఇప్పుడు చంద్రబాబు కారణంగా ఒంటరైపోయారు

devineni uma: తెలుగుదేశం అధినేతకు.. ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటిచేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ.. ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్లముందే.. ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా.. కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబడే నాయకులు కూడా దూరమయ్యారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా అధినేత తీసుకున్న నిర్ణయంతో.. జిల్లాలో ఆ నాయకుడు ఒంటరైపోయారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఇంతకీ.. ఎవరా లీడర్?

ఉమా పరిస్థితి అయోమయం:
కృష్ణా జిల్లా టీడీపీలో.. దశాబ్దం పాటు తన హవా కొనసాగించిన దేవినేని ఉమామహేశ్వరరావు గురించే ఈ చర్చంతా. జిల్లాలో.. టీడీపీ అంటే దేవినేని ఉమానే అనే స్థాయిలో ముద్ర వేసుకున్నారు. కానీ.. ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఉమా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఒకప్పుడు.. జిల్లాలో కనుసైగతో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన ఉమకి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అస్సలు మింగుడుపడటం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వ్యక్తిని సడెన్ గా ఎందుకు తెచ్చారు?
టీడీపీ ప్రక్షాళనలో భాగంగా.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్ష పదవులను కట్టబెట్టారు చంద్రబాబు. కృష్ణా జిల్లాలో.. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటులో అధిష్టానవర్గం ఉమని లెక్కలోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. ఉమా సొంత నియోజకవర్గమైన మైలవరం.. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ.. మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ని అధ్యక్షుడిగా నియమించారు. దీనిపై.. కనీసం ఉమకి సమాచారం కూడా ఇవ్వలేదని కేడర్ అంతా చెవులు కొరుక్కుంటోంది. ఎప్పుడో.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నెట్టెం రఘురాంని.. ఆకస్మికంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఏదో జరిగి ఉంటుందని.. దేవినేని వర్గం అనుమానిస్తోంది.
https://10tv.in/chandrababu-follows-cm-jagan-in-east-godavari-district/
పార్టీ సీనియర్లతో.. చంద్రబాబు చర్చించినప్పుడు కూడా ఒకరిద్దరితో.. విజయవాడ పార్లమెంట్ కమిటీ అధ్యక్ష పదవి.. దేవినేని ఉమాకి ఇస్తున్నట్లు చెప్పారట. మరి.. ఆఖరి నిమిషంలో ఉమ పేరుకి అడ్డుపడిన శక్తి ఏంటన్న దానిపైనే.. పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో.. టీడీపీ ఘోర ఓటమి తర్వాత.. కృష్ణా జిల్లా పార్టీలో దేవినేని ఉమ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానినే.. పార్లమెంట్ పరిధిలో పార్టీ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నారు.

కొంతకాలం ఉమని పక్కనపెట్టాలని చంద్రబాబు నిర్ణయం:
నెట్టెం రఘురాం.. మళ్లీ తెరపైకి రావడం వెనుక కూడా కేశినేని హస్తం ఉందని.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ.. అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడి పని చేయలేదని ఉమ భావిస్తున్నారట. చంద్రబాబుకి.. అత్యంత నమ్మకస్తుడైనప్పటికీ.. జిల్లా పార్టీలో ఎవరికీ ఆయనతో సఖ్యత లేకపోవడం మైనస్ అవుతోందట. అందుకే.. చంద్రబాబే కొంతకాలం ఉమని పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నట్లు కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.

ఉమ అనుచరుడిని బాధ్యతల నుంచి తప్పించారు:
మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ బాధ్యతలు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకి అప్పగించారు. ఇక్కడ దేవినేనికి అనుచరుడు.. బచ్చుల అర్జునుడిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. గన్నవరం బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడంతో.. ఇక దేవినేని ఉమా కేవలం విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని.. అంతా అనుకుంటున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా.. జిల్లా మొత్తం తిరిగి హడావిడి చేసిన ఉమ.. ఇప్పుడు గిరిగీసుకొని ఎలా కూర్చుంటారని ఒకటే చర్చ.

ఉమ తప్పు చేశారు దాని ఫలితం చూస్తున్నారు:
ఒకప్పుడు.. కృష్ణా జిల్లా టీడీపీలో చీమ చిటుక్కుమన్నా ఉమకి తెలిసేది. కానీ.. ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఉమని సంప్రదించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఐతే.. జరుగుతున్న పరిణామాల్లో ఉమా తప్పు కూడా ఉందంటున్నారు. జిల్లా నేతలతో.. సత్సంబంధాలు లేవని.. అందుకే అంతా ఆయనను వ్యతిరేకిస్తున్నారని టాక్. జిల్లా మంత్రి కొడాలి నాని.. దేవినేని ఉమని ఎన్ని మాటలంటున్నా.. జిల్లా టీడీపీ నాయకులు రెస్పాండ్ కావడం లేదట. పార్టీ హైకమాండ్ నుంచి.. ఉమకి అండగా నిలబడాలని ఆదేశాలొచ్చినా.. ఎవరూ పట్టించుకోవట్లేదట. పైగా.. ఐదేళ్లు మంత్రిగా పనిచేసి ఎవరినీ పట్టించుకోలేదని చెబుతూ.. దెప్పిపొడుస్తున్నారట కృష్ణా జిల్లా నేతలు.