సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాం.. ప్రతి జిల్లాలో: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

  • Published By: vamsi ,Published On : June 4, 2020 / 12:57 AM IST
సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాం.. ప్రతి జిల్లాలో: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సోషల్‌ మీడియా పరిశీలనకు విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లోనే కాకుండా ఏదైనా ఒక వాట్సప్‌ గ్రూపులో అభ్యంతరకర అంశాలు పోస్టు చేస్తున్నవారిపై వాచ్ చేస్తున్నామని అన్నారు. 

వారిపైన ఎలా చర్యలు తీసుకోవాలి? గ్రూపులో సభ్యులందర్నీ బాధ్యుల్ని చేయాలా? అభ్యంతరకర అంశం పోస్టు చేసిన వ్యక్తిపైన, గ్రూపు అడ్మిన్ పైనే చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. 

ఇక దిశ యాప్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకూ 167 కేసుల్లో వారంలోనే దర్యాప్తు పూర్తి చేశామని, వీటిలో 33 అత్యాచారాల కేసులు కాగా, 134 లైంగిక నేరాల కేసులు. 20 కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగామన్నారు. 2017లో 49.3 శాతంగా ఉన్న శిక్షల శాతాన్ని ఈ ఏడాది 64 శాతానికి పెంచినట్లు ఆయన చెప్పారు. 89 రకాల పోలీసు సేవల్ని ఆన్‌లైన్‌లో అందించేందుకు వీలుగా త్వరలో ‘సురక్ష స్పందన యాప్‌’ తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

Read: ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా టెస్టులు..@3, 971 కేసులు