Diamonds : కడప జిల్లాలో వజ్రాల గనులు.. జీఐఎస్ వెల్లడి
కడప జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర మైనింగ్ శాఖకు నివేదిక అందించింది.

Diamonds
Diamonds : ఆంధ్రప్రదేశ్ లో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ నిర్వహించిన ఈ సంస్థ జీ-4 స్థాయి పరిశోధన అనంతరం 100 గనులను గుర్తించి నివేదిక సిద్ధం చేసింది. కడప జిల్లాలోని పెన్నా నది బేసిన్ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. దేశ వ్యాప్తంగా పరిశోధన పూర్తి చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. బుధవారం రాష్ట్రాల మైనింగ్ శాఖలతో ఢిల్లీలో గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గనుల నివేదికలను ఆయా రాష్ట్రాలకు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నివేదిక అందుకున్నారు. సమావేశంలో ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనింగ్ రంగాన్ని ఉత్తేజ పరచడానికి వీలుగా దేశంలో ఖనిజ అన్వేషణను వేగవంతం చేస్తోందని వివరించారు. మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్ బ్లాక్ నివేదికలను అందుకున్నాయని వివరించారు.
అత్యధికంగా మధ్యప్రదేశ్ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వేషణలో తేలింది. కడపతోపాటు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాలో గనులను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.