APSRTC : ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ చెల్లింపులు

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.

APSRTC :  ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసి డిజిటల్ చెల్లింపుల  వైపు ప్రయత్నాలు మొదలు పెడుతోంది. ఇందులో భాగంగా విజయవాడ…గుంటూరు-2 డిపోలను ఎంపిక చేశారు. ఈ రెండు డిపోల  నుంచి నడిచే బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్(టిమ్స్) స్ధానంలో డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించే ఈ-పోస్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సులలో చిల్లర సమస్య ఉండదు.

విజయవాడ, గుంటూరు-2 డిపోల నుంచి  తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతలకు వెళ్లే సర్వీసుల్లో  ఈ–పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు.  ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్‌-కం-కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు.  వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెడతారు. దశల వారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్‌ బుకింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్‌ యంత్రాలను సమకూర్చనున్నారు.

రాయితీ టికెట్లు కూడా పొందవచ్చు
యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌)  సాంకేతికతతో కూడిన ఈ–పోస్‌ యంత్రాల సరఫరాకు ఇక్సిగో–అభిబస్‌ సంస్థతో ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యంత్రాల ద్వారా సాధారణ టికెట్లతో పాటు సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితరులు కూడా రాయితీ టికెట్లు పొందొచ్చని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు