అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్‌ ట్రావెల్స్‌ కార్యాలయానికి తాళం

అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్‌ ట్రావెల్స్‌ కార్యాలయానికి తాళం

Dinesh Travels office locked : అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్‌ ట్రావెల్స్‌ ఓనర్‌ స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని ట్రావెల్స్‌ కార్యాలయానికి తాళం వేసిన స్వామి… ఫోన్‌ సైతం స్విచ్‌ఆఫ్‌ చేసుకుని అదృశమయ్యాడు. అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్న తరుణంలో… ట్రావెల్స్‌ ఓనర్‌ స్వామి కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

హైదరాబాద్‌లోని షేక్‌ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. నిన్న ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి సింహాచలం బయలుదేరారు.

అప్పటివరకు సరదాగా సాగిన ఆ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వెంటనే బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు అధికారులు. ప్రమాదం గురించి తెలియగానే మంత్రి అవంతి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.