హోటల్స్, రెస్టారెంట్స్‌లో డర్టీ పిక్చర్.. రెగ్యులర్‌గా హోటల్‌కెళ్లి బిర్యానీ లాగిస్తున్నారా..? అయితే మీకు మూడినట్టే

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 05:15 PM IST
హోటల్స్, రెస్టారెంట్స్‌లో డర్టీ పిక్చర్.. రెగ్యులర్‌గా హోటల్‌కెళ్లి బిర్యానీ లాగిస్తున్నారా..? అయితే మీకు మూడినట్టే

dirty picture in hotels and restaurants: మీరు నాన్‌వెజ్‌ ప్రియులా..? కోడికూర, చికెన్‌ లెగ్ పీస్‌లంటే పడి చస్తారా..? రెగ్యులర్‌గా హోటల్‌కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్‌ కిచెన్‌లో డర్టీ పిక్చర్ డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది.

ఫ్రిజ్‌లో మాంసం ముద్దలు, గ్రిల్‌కు చికెన్‌ పీస్‌లు, అస్తవ్యస్త అపరిశుభ్రత.. గుట్టలు గుట్టలుగా ప్యాకెట్లలో మాంసపు ముద్దలు.. ఐస్‌ గడ్డల్లో రోజుల తరబడి నాన్‌వెజ్‌ నిల్వలు.. తీసేకొద్దీ సాగే బూజు.. కెమికల్ దట్టించిన మాంసం.. కుళ్లిపోయిన మటన్‌తో కస్టమర్లకు వెరైటీ వంటకాలు.. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, స్టోరేజ్‌ చేసిన వంటకాలు ..

హోటల్ కిచెన్లలో కంపు కొట్టే కథా చిత్రమ్‌:
నాన్‌వెజ్‌ ప్రియురాలారా తస్మాత్‌ జాగ్రత్త.. మీరు తినేది టేస్టీ టెస్టీ యమ్మీ యమ్మీ పుడ్ కాదు.. కుళ్లిన మాంసం.. పాచిపోయిన అన్నం. ఇవి తింటే డైరెక్ట్‌గా యమపురికి నాన్‌స్టాప్‌ టిక్కెట్ తీసుకున్నట్టే. కరోనా కల్లోలంలో ఏం జరుగుతుందోనన్న డౌట్‌తో.. హోటల్‌పై నజరేసిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు.. కంపుకొట్టే నిజాలు నివ్వెరపోయేలా చేశాయి.

రుచి శుచి లేని ఆహార పదార్థాలు వడ్డింపు:
కార్పొరేట్‌ లుక్ రెస్టారెంట్స్‌, కలర్‌ఫుల్‌ లైటింగ్‌తో వెలిగిపోయే హోటల్స్‌, రా రమ్మని పిలిచే స్వాగత మర్యాదలు, నోరూరించే బిర్యానీ, కలర్‌ఫుల్‌ మెనూలు.. ఇవన్నీ హోటల్‌ ఎంట్రీ నుంచి డైనింగ్‌ టేబుల్ వరకే.. కిచెన్‌లోకి తొంగి చూస్తే కంపుకొట్టే కథా చిత్రమ్‌ కళ్లకు కడుతోంది. అందమైన హోటల్‌లో అడ్డమైన తిండి తింటున్నామా అన్న వికారం పుడుతోంది. స్పాట్..

కుళ్లిన మాంసంతో వంటకం.. నాలుగు గోడల మధ్య అద్దాల మేడలో ప్రజారోగ్యంతో చెలగాటం
అసలే కరోనా కంగారెత్తిస్తోంది. బిజినెస్ లేదు మొర్రో అంటే రెస్టారెంట్లు, హోటళ్లకు.. ప్రభుత్వం కండిషన్లతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. జనాలు ఇంటి గడప దాటి బయటకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్ల కోసం రుచి శుచి ఉన్న ఆహార పదార్థాలను వండి వడ్డించాల్సిన హోటల్‌ నిర్వాహకులు.. ఆ సోయే మరచిపోయారు. తాము వండేది ఎవరు చూస్తారు..? ఎవరు అడుగుతారులే అన్న దైర్యంతో కుళ్లిన మాంసాన్ని జనాలకు అంటగడుతున్నారు. నాలుగు గోడల మధ్య అద్దాల మేడలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

రోజుల తరబడి నిల్వ చేసిన ఆహారం సర్వ్ :
విశాఖలోని హోటల్‌లో నిర్వాహకులు ఆహారాన్ని నిల్వ చేశారు. ఎన్ని రోజుల కిందట స్టోర్‌ చేశారో వాళ్లకైనా తెలుసో లేదో. కానీ ఇదే ఆహారాన్ని హోటల్‌కి వచ్చే కస్టమర్లకు వేడి చేసి ఫ్రై చేసి అందిస్తున్నారు. భోజన ప్రియులు భోజనం వేడిగా ఉందని చూస్తున్నారే తప్ప.. హీట్‌ వెనుక ఎంత చీటింగ్‌ ఉందో అర్థం చేసుకోలేకపోతున్నారు. మా హోటల్‌ కమ్మని రుచులకు కేరాఫ్‌ అంటూ ఉదరగొడుతున్న నిర్వాహకులు.. జనం జేబులకి చిల్లులు పెడుతూ వారి ఆరోగ్యంతో చెడుగుడు ఆడుతున్నారు. ఈ కంపు లీలలన్నీ అధికారుల దాడుల్లో ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

ఫ్రిజ్ డోర్ తీయగానే కంపు వాసన, ప్లాస్టిక్ కవర్లలో నిల్వ:
విజయవాడలో బార్బిక్యూ నేషన్‌ హోటల్‌ లో మెరుపు తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టి అధికారులకు మైండ్‌ బ్లాంక్ అయినంత పనైంది. కిలోల కొద్ది మాంసం ఫ్రిజ్‌లో పెట్టారు. అది కూడా ప్లాస్టిక్‌ కవర్లలో కిలోలకొద్ది నిల్వ చేశారు. ఫ్రిజ్ డోర్ తీయగానే కంపు వాసన.. నశాళానికి కెక్కేసింది. ఇదా.. జనానికి అంటగడుతున్న తిండి అంటూ అధికారులు గుడ్లు మెలేశారు.

ఒక్క మాంసమే కాదు.. గోధుమపిండి, మైదాపిండి, కూరగాయలు, నూనె అన్నీ అపరిశుభ్ర వాతావరణంలోనే:
ఒక్క మాంసమే కాదు.. గోధుమపిండి, మైదాపిండి, కూరగాయలు, నూనె ఇలా దాదాపు అన్ని పదార్థాలు అపరిశుభ్ర వాతావరణంలోనే ఉన్నాయి. ఎక్కడా శుభ్రత పాటించ లేదు. కోవిడ్‌ రూల్స్‌ అన్న ముచ్చటే ఎక్కడా కనిపించ లేదు. ఫ్రంట్‌ ఆఫీస్‌ నుంచి కిచెన్‌ దాకా సేమ్‌ సీన్. ఎవరేమైపోతే మాకేంటి.. మాక్కావాల్సింది మాంసం.. మోసాలేనన్న థియరీతో హోటళ్ల నిర్వాహకులు పబ్బం గడుపుకుంటున్నారు.

అనారోగ్యంతో ఉన్న గొర్రెల మాంసం:
నాన్‌వెజ్‌ ప్రియులకు షాకిచ్చే నిజాలు అధికారులు తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని మాంసాన్ని వండి, వడ్డిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకల మాంసాన్ని హోటళ్లలో వినియోగిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా, అధికార ముద్ర లేకుండా వినియోగించే ఈ మాంసం తిన్న వారెవరైనా అనారోగ్యానికి గురికాక తప్పదు. కొంతమంది చేసే నిర్వాకాలకు అన్ని హోటళ్ల వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది.