దిశ యాప్ మరో సక్సెస్, 8నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 03:12 AM IST
దిశ యాప్ మరో సక్సెస్, 8నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా బయటపడ్డారు. తాజాగా మరో ఘటనలో 8 నిమిషాల్లో స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఓ మహిళని… ఆటోడ్రైవర్ బారి నుంచి కాపాడారు. ఆటోడ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా కొల్లేటికోటలో దిశ కేసు నమోదైంది. ఆటో డ్రైవర్ పై అనుమానంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటోడ్రైవర్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాడు. ఇది గనమించిన మహిళ వెంటనే దిశ యాప్ ఎస్ వో ఎస్ ద్వారా పోలీసులకు సమాచారం పంపింది. 8 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. ఆటో డ్రైవర్ పెద్ది రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపదలో ఉన్న మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడం.. 8నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకోవడం.. వెంటనే ఆ మహిళకు రక్షణ కల్పించి.. కేసును నమోదు చేయడం దిశ యాప్ పనితీరుకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అధికారులు అంటున్నారు. దిశ యాప్ కు అనుసంధానంగా పనిచేస్తున్న పోలీసులకు, అధికారులకు ప్రజలు అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం.. దిశ యాప్ ను కూడా తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో ఈ చిన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకునేలా యాప్‌ను తయారు చేశారు. ఇంతకీ దిశ యాప్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ లేకపోయినా పని చేస్తుంది:
ఈ దిశ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంది. ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా పని చేయడం దీని ప్రత్యేకత. మొబైల్‌లో యాప్‌ను ఓపెన్ చేసి.. ఎస్‌ఓఎస్‌ (SOS) బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు.. ఆ ఫోన్‌ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది.. చిరునామా వంటి వివరాలన్నీ పోలీస్ కంట్రోల్‌ రూంకి వెళతాయి. మొబైల్ ఏ లోకేషన్‌లో ఉంది.. 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.

ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ స్పెషల్:
దిశ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ చాలా ప్రత్యేకమైనది. ఓ మహిళ విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రదేశం, ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదు చేసిన మార్గంలో కాకుండా.. మరో మార్గంలోకి ఆటో వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంతో పాటూ లోకల్ పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ ఓ మెసేజ్ వెళుతుంది.

బటన్ నొక్కగానే పోలీసులకు సమాచారం:
ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ (SOS) బటన్‌ నొక్కగానే.. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు. జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. దీన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.

వృద్ధులకు కూడా ఉపయోగమే:
దిశ యాప్ ద్వారా 100/112 నంబర్లకు సాయం కోసం ఫోన్‌ చేయొచ్చు. యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

దిశ యాప్ లో ఇంకా ఏమున్నాయంటే:
ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నావిగేషన్‌లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు.

See Also | ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం