దివ్య తేజస్వినిది హత్యే, నాగేంద్రే చంపేశాడు – ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 07:34 AM IST
దివ్య తేజస్వినిది హత్యే, నాగేంద్రే చంపేశాడు – ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి

Divya Tejaswini was killed by Nagendra : –  ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వినిది హత్యేనని తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ నివేదికలు ఇవే స్పష్టం చేశాయి. దివ్య ఒంటిపైనున్న కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని.. నిందితుడు నాగేంద్రనే ఆమె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు.



దీనికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని పోలీసులకు నాగేంద్ర ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. పక్కా స్కెచ్‌ ప్రకారమే దివ్య తేజస్వినిని నాగేంద్ర చంపాడని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే మర్డర్‌ చేశాడనే నిజాన్ని ఇటు ఫోరెన్సిక్‌ అటు పోస్ట్‌మార్టం నివేదికలు బయటపెట్టాయి.



నాగేంద్ర ఒంటిపై గాయాలు తనకు తాను చేసుకున్నవేనని రిపోర్ట్‌ స్పష్టం చేసింది. ముందు దివ్యతేజస్వినిపై నాగేంద్ర దాడి చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు, ఆమె మరణించిందని నిర్థారించుకున్న తర్వాతే ఎవరికీ అనుమానం రాకుండా కత్తితో తన శరీరంపై స్వయంగా గాయాలు చేసుకున్నాడు.



ఆపై తామిద్దరు ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు కట్టుకథ అల్లి, జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం నివేదికలు నాగేంద్ర చెప్పిన విషయాలకు విరుద్ధంగా ఉండటంతో అతని కట్టుకథ గుట్టు రట్టయ్యింది.



తమ కుమార్తెను హత్య చేసి.. హాస్పిటల్ ఉండి తప్పుడు ప్రచారం చేశాడని నాగేంద్రపై దివ్య తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంనీ నాగేంద్ర చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. నాగేంద్రకు సహకరించిన వారి మీద కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ కేసు వేగంగా విచారిస్తున్నందు చాలా సంతోషంగా ఉందన్నారు.



దివ్య తేజస్విని హత్య విషయంలో నాగేంద్రతో పాటు మరికొందరిపై దిశ టీం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దివ్యను మర్డర్‌ చేసే విషయంలో నాగేంద్రకు సహకరించిన వ్యక్తులను కేసు పరిధిలోకి తీసుకువచ్చేలా దిశ టీం అడుగులు వేస్తోంది.



ఈ కేసుకు సంబంధించి ఇన్‌స్టాగ్రాం, నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు…. నాగేంద్రను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన వెంటనే అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఈనెల 28న ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు.