AP Assembly Budget Session-2023: అందుకే అసెంబ్లీలో మాపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు: టీడీపీ ఎమ్మెల్యేలు

వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడంతో జీర్ణించుకోలేక దళిత ఎమ్మెల్యే పై దాడి చేశారని చెప్పారు.

AP Assembly Budget Session-2023: అందుకే అసెంబ్లీలో మాపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు: టీడీపీ ఎమ్మెల్యేలు

AP Assembly Budget Session-2023

AP Assembly Budget Session-2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇవాళ వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేగా సభలో తాను ఉండడం వైసీపీకి కంటగింపుగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

“నేనే దాడి చేశానంటున్నారు. దళితుడికే పుట్టావా? అని గతంలో మంత్రి నాగార్జున అన్నారు. ఎడిట్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి. క్షేత్ర స్థాయిలో పట్టు కొల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడులు చేస్తున్నారు. బుచ్చయ్య పైనా దాడికి ప్రయత్నించారు. దీనికి తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సుధాకర్ బాబు నాపై దాడి చేసినప్పుడు నేను కిందపడిపోయాను.

స్పీకరే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి.‍. నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతున్నారు. నేనే దాడి చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి. ప్రభుత్వం కులాలను రెచ్చగొడుతోంది. ఎస్సీలే నాపైకి ఎందుకొస్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రశ్నించడం వల్లే మాపై దాడులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే ఈ దాడికి కారణం. స్పీకర్ రక్షణ కోసం మార్షల్స్ లేరా..? చివరి వరుసలో ఉన్న వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు?” అని అన్నారు.

అసెంబ్లీలో తమపై దాడి జరిగితే, తమనే సస్పెండ్ చేశారని టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 40 ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న తాను, ఇవాళ జరిగినటువంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా? అని అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులన్నీ సభలో వైసీపీ నేతలు హరిస్తున్నారని చెప్పారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా? అని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేల పై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడంతో జీర్ణించుకోలేక దళిత ఎమ్మెల్యే పై దాడి చేశారని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏం చేశారని దాడి చేశారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో దాడికి ప్రతిదాడి ఉంటుందని వైసీపీ నేతలు మర్చిపోవద్దని హెచ్చరించారు. అతి త్వరలో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

స్పీకర్ మినిట్ టు మినిట్ వీడియో బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని చెప్పారు. నిజం ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని తెలిపారు. కాగా, అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టీడీపీ నేతల తీరు సరిగ్గాలేదని అసహనం వ్యక్తం చేశారు.

AP Assembly Budget Session-2023.. 7th Day: అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యేను నెట్టేసిన వైసీపీ సభ్యుడు.. Live Updates